శామీర్‌పేట, జనవరి 30 : దళితులను ధనవంతులుగా మార్చడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని ఆలోచన కేసీఆర్ చేశారని తెలిపారు. ఆదివారం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట, మూడుచింతలపల్లి మండలాల్లోని యాడారం, మురహార్పల్లి, పోతారం గ్రామాల్లో ఆదివారం పర్యటించి దళితబంధు లబ్ధిదారుల ఎంపిక సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పైలెట్ ప్రాజెక్టు కింద నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఫిబ్రవరి 10వ తేదీలోపు ఎంపిక చేసి రూ.10 లక్షలు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. పథకంలో 30రకాల వ్యాపారాలు ఉన్నాయని, వారికి నచ్చిన పనిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్చార్జి చామకూర మహేందర్‌రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, ఎంపీపీలు ఎల్లూభాయిబాబు, హారికమురళీ గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు కంటం కృష్ణారెడ్డి, సర్పంచ్‌లు భాస్కర్, సుజాత, హరివర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీ అశోక్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్, మల్లేశ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సతీశ్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి(బీఎన్ఆర్), వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరికలు..
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసలు ప్రారంభమయ్యాయని మంత్రి మల్లారెడ్డి అన్నారు. దళితబంధు పథకం సర్వేలో భాగంగా మురహార్పల్లి గ్రామంలో మంత్రి పర్యటించగా బీజేపీ నాయకుడు భిక్షపతితో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు.