Heera Group | ఖైరతాబాద్, మే 31 : హీరా గ్రూప్ పేరుతో రూ.5,600 కోట్ల స్కామ్‌కు పాల్పడిన నౌహెరా షేక్‌కు సంబంధించిన స్థలాలను ఎవరూ కొనుగోలు చేయవద్దని ఆల్ ఇండియా హీరా గ్రూప్ ఇన్వెస్టర్స్ యాక్షన్ కమిటీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. శనివారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. కమిటీ ప్రతినిధి పర్హాన్ రషీద్, బాధితులు అమ్తుల్ మాలిక్, ఎండి అన్వర్ అక్తర్, షౌకత్ అలీతో కలిసి వివరాలు వెల్లడించారు.
సుమారు 1.72లక్షల మంది ఇన్వెస్టర్లను ముంచిన నౌహేరా షేక్ ప్రస్తుతం జైలులో ఉందని అ న్నారు. ఆమెపై 37 వారెంట్లు, 17 చెక్‌బౌన్స్ కేసులున్నాయని తెలిపారు. ఆమెకు సంబంధించిన 126 రకాల ఆస్తులు ఈడీ జప్తు చేసిందని, ఆమె కుటుంబ సభ్యులు కొందరు ఆ ఆస్తులను విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటిని కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు. ప్రస్తుతం నిందితురాలు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని, ఆమెకు బెయిల్ ఇవ్వద్దని అన్నారు. ఈ కేసును పారదర్శకంగా విచారణ జరిపి బాధ్యురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.