ఆశవర్కర్లకు స్మార్ట్ఫోన్లు అందజేత
ఇకనుంచి ఆన్లైన్లో వివరాల నమోదు
హర్షం వ్యక్తం చేస్తున్న ఆశవర్కర్లు
జూబ్లీహిల్స్,ఫిబ్రవరి 25: ఇంటింటికీ తిరుగుతూ యోగక్షేమాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఆశవర్కర్లతో సర్వేలు చేయించింది. ఎన్సీడీ, వీహెచ్‌పీ, కొవిడ్, ఎంఐ ఇలా లెక్కకు మించి ఆరోగ్య సర్వేలు చేస్తున్న ఆశాలకు పనిభారం తగ్గిచేందుకు ఆన్లైన్ విధానానికి శ్రీకారం చుట్టింది. వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్న ఆశవర్కర్లకు ప్రభుత్వం ఇప్పటికే మూడు సార్లు వేతనాలు పెంచింది. ఆత్మగౌరవంతో బతికేలా సముచిత గౌరవం కల్పించడంతో పాటు స్టార్ట్ ఫోన్లు అందజేయడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. శ్రీరాంనగర్ పీహెచ్సీలో 25, వినాయక్‌నగర్ పీహెచ్సీలో 26, బోరబండలో 25 మందికి స్మార్ట్ ఫోన్ల పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు. శుక్రవారం వరకు శ్రీరాంనగర్ క్లస్టర్లో 117 మంది ఆశ వర్కర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ పూర్తిచేశామని ఎస్పీహెచ్వో డాక్టర్ అనురాధ తెలిపారు. దీంతో వివరాలు రిజిస్టర్లలో నమోదు చేస్తున్న ఆశాలు ఇకపై ఆన్లైన్లో ఆయా పనులను సులువుగా చేయనున్నారు.
ఆన్లైన్లో సమాచారం…
ప్రభుత్వం సిమ్‌తో పాటు ఇచ్చిన ఫోన్లలో ఆయా వైద్య విభాగాల యాప్‌లను పొందుపరచడంతో సర్వేకు వెళ్లిన ఆశాలు అక్కడే వాటిని ఫోన్లలో నమోదు చేయనున్నారు. ఇందులో భాగంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ), విలేజ్ హెల్త్ ప్రొఫైల్ (వీహెచ్‌పీ) తదితర యాప్‌లను పొందుపరిచారు.
పని భారం తగ్గింది
సర్వేలు చేస్తున్నప్పుడు సమాచారాన్ని రిజిస్టర్లో నమోదుచేయడం కష్టతరంగా ఉండేది. ఇటీవల అధికారులు సిమ్ కార్డులిచ్చిన అంత ప్రయోజనం చేకూరలేదు. తాజాగా ఫోన్లతో పాటు కొత్త సిమ్‌కార్డులు ఇవ్వడంతో పని భారం తగ్గింది.
–లక్ష్మీదేవి, ఆశవర్కర్,కృష్ణానగర్