మొయినాబాద్, ఫిబ్రవరి 28: నేరాల నియంత్రణలో జాగీలాల పాత్ర చాలా కీలకమని ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ బీ. శివధర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ లో ఏడాది పాటు శిక్షణ పొందిన 24వ బ్యాచ్‌కి చెందిన 72 జాబిలాలు శుక్రవారం పాసింగ్ అవుట్ (Passing Out Parade)కార్యక్రమం నిర్వహించారు. సునకాలు చేసిన ప్రదర్శనలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. నియంత్రణలో జాగిలాల పాత్ర ఎలా ఉంటుందో ప్రదర్శన రూపంలో శునకాలు చేయగా అందరినీ అబ్బురపరిచాయి.
ఈ సందర్భంగా శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. నేరాల నియంత్రణలో పోలీసులకు జాగిలాలు ఎంతో సహకరిస్తాయని చెప్పారు. నేరస్తులను త్వరగా గుర్తించడానికి జాగిలాలను ఉపయోగించడం జరుగుతుందని పేర్కొన్నారు. దేశంలో ఉన్న అన్ని శునకాల శిక్షణ కేంద్రాలలో మొయినాబాద్‌లో ఉన్న ఐఐటీఏ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని అన్నారు. తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన జాగిలాలకు ఇక్కడే శిక్షణ ఇస్తున్నామన్నారు. మొయినాబాద్‌లో శిక్షణ పొందిన జాగిలాలు అనేక విజయాలు సాధించిందని తెలిపారు. కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ ఐజీ తఫ్సీర్ ఇక్బాల్, పోలీసు ఉన్నత అధికారులు పాల్గొన్నారు.