సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 6 : కార్పొరేట్ దవాఖాన తరహాలో పేద రోగులకు అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించి ఉస్మానియా దవాఖాన పేద ప్రజల ఆదరణను చూరగొంటున్నది. ఉస్మానియా దవాఖాన సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలో ఓ నిరు పేదకు కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించి ఉస్మానియా ప్రతిష్టను మరింత ఇనుమడింపజేస్తున్న వైద్యులను దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ ప్రత్యేకంగా అభినందించారు. బుధవారం దవాఖాన ఆడిటోరియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా, చేర్యాల గ్రామానికి చెందిన పెద్దింటి మురళి (38) గత కొంత కాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల ఉస్మానియా దవాఖాన ఓపీకి వచ్చిన మురళీని వైద్యులు పరీక్షించి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగానికి తరలించారు. ఆ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ మధుసూదన్ అన్ని పరీక్షలు నిర్వహించగా కాలేయం పూర్తిగా చెడిపోయిందని గుర్తించి కాలేయ మార్పిడి అవసరమని గుర్తించారు. దీంతో డాక్టర్ మధుసూదన్ బృందం గాంధీ దవాఖానలో బ్రెయిన్ డెడ్ అయిన రోగి కాలేయాన్ని సేకరించి ఉస్మానియా దవాఖానకు తీసుకువచ్చి గత నెల 20న మురళీకి అమర్చారు. శస్త్ర చికిత్స అనంతరం మురళి ఆరోగ్యం పూర్తిగా కోలుకోవడంతో బుధవారం డిశ్చార్జి చేశారు. విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సను నిర్వహించిన సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్ మధుసూదన్, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ పాండు నాయక్, సీఎస్ ఆర్ఎంవో-1 డాక్టర్ శేషాద్రితో పాటు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం, అనస్థీషియా విభాగం వైద్యులు, నర్సులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.