సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ): వాట్సాప్ గ్రూప్‌లో ఒక వైద్యుడి ఫోన్ నెంబర్‌ను యాడ్ చేసి స్టాక్స్‌లో మంచి లాభాలొస్తాయని రోజు మాట్లాడుతూ నెల రోజుల తరువాత రూ. 83 లక్షలు పెట్టుబడి పెట్టించి సైబర్‌నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. ఈసీఐఎల్ ప్రాంతంలోని కమలానగర్‌కు చెందిన బాధితుడు వృత్తిరీత్యా డాక్టర్. గత ఏడాది నవంబర్ 15వ తేదీన బాధితుడి వాట్సాప్ నెంబర్‌ను బీఎస్ఈ-ఎన్ఎస్ఈ సీ4 పేరుతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు.
అందులో నుంచి అనిల్ గోయల్ అనే వ్యక్తి ఫోన్ చేసి తానే ఈ గ్రూప్ అడ్మిన్నని తమకు స్టాక్ మార్కెట్‌పై 30 ఏండ్ల అనుభవం ఉందని భారత్‌తో పాటు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లపై పట్టుందని చెప్పుకున్నాడు. తాము ఫిబ్రవరి 9వ తేదీన ‘సీక్రెట్స్ ఆప్ స్టాక్స్’ పేరుతో ముంబాయిలోని ది తాజ్‌మహల్ ప్యాలెస్‌లో పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నామని నమ్మించాడు. ఆ తరువాత రోజు ఇండియా, ఆమెరికా స్టాక్ మార్కెట్లో తాము ఈ రోజు ఫలాన ట్రేడింగ్ చేస్తే ఇంత లాభం వచ్చిందని స్క్రీన్ షాట్స్ పెడుతూ వైద్యుడి దృష్టిని స్టాక్స్ వైపు ఆకర్షించారు.
నెల రోజుల తరువాత గోయల్ అనే పేరుతో అప్పటి వరకు చాటింగ్ చేస్తున్న వ్యక్తి ఒమ్మై సల్మా పేరుతో ఒక మహిళను కస్టమర్ సపోర్టు రిఫ్రజెంటివ్గా పరిచయం చేశాడు. దీంతో ఆమె ఒక లింక్‌ను పంపించి అందులో జీటీఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకొని స్టాక్ ట్రేడింగ్ ప్రయత్నించాలని సూచన చేయడంతో అలాగే రెండు దఫాలుగా రూ. లక్ష డిపాజిట్ చేశాడు. స్క్రీన్‌పై అసలుతోపాటు లాభాలు కన్పించాయి, ఆ తరువాత మరో రూ.9 లక్షలు డిపాజిట్ చేశాడు. అయితే ఇలా కాదని మీకు మోడ్రన్ డయగ్నాస్టిక్ ఐపీఓకు సంబంధించిన షేర్స్ అలాట్ చేస్తున్నామంటూ నమ్మిస్తూ దఫదఫాలుగా డబ్బు డిపాజిట్ చేయించారు.
అప్పటికే రూ.83 లక్షల వరకు సైబర్‌నేరగాళ్లు సూచించిన ఖాతాలలో వైద్యుడు డబ్బు డిపాజిట్ చేస్తూ వెళ్లాడు. చివరకు స్క్రీన్‌పై కన్పిస్తున్న డబ్బును విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నించడంతో అది సాధ్యం కాలేదు, మీకు షేర్స్ కేటాయించామని, ఆ డబ్బు పూర్తిగా చెల్లిస్తేనే మీకు విత్‌డ్రా అవకావశం ఉంటుందని నిందితులు సూచించారు. తన డబ్బులో నుంచి మినహాయించుకొని మిగతా వాటిని విత్ డ్రాకు అవకాశం ఇవ్వాలని చెప్పగా అలా కుదరదని మరో రూ. 40 లక్షలు చెల్లిస్తే మీకు విత్ డ్రా అప్షన్ ఉంటుందంటూ చెప్పి సెల్ఫోన్లు స్వీచాఫ్ చేయడంతో ఇదంతా మోసమని గుర్తించి మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.