మన్సూరాబాద్, మే 20: తాను మరణిస్తూ..మరో ముగ్గురికి ప్రాణం పోసింది ఓ మహిళ.. సూర్యాపేట జిల్లా, మోతె మండలం, తుమ్మగూడేనికి చెందిన ఉబ్బిపెల్లి ఉమ (33) భర్త మధుసూదన్‌తో కలిసి నగరంలో ఉంటున్నారు. ఈ నెల 16న రాత్రి ఎన్టీఆర్నగర్ వద్ద రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఉమకు తీవ్రగాయాలవ్వగా, చికిత్స కోసం ఎల్బీనగర్లోని కామినేని దవాఖానకు తరలించారు.
వైద్యులు రెండు రోజుల పాటు చికిత్స అందించినా.. ప్రయోజనం లేకపోయింది. ఈనెల 18న ఉమ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు గుర్తించారు. విషయం తెలుసుకున్న జీవన్‌దాన్ సంస్థ ప్రతినిధులు ఆమె భర్త మధుసూదన్‌ను కలిసి.. అవయవదానంపై అవగాహన కల్పించారు. అతడి అంగీకారంతో ఉమ నుంచి రెండు కిడ్నీలు, లివర్, రెండు కార్నియాలను సేకరించారు.