ఖైరతాబాద్: యాంటీబయోటిక్స్‌ను అడ్డగోలుగా వాడితే అనర్థాలకు దారి తీస్తుందని వైద్యులు అభిప్రాయపడ్డారు. నిమ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అనిస్థీషియాలజీ, ఇన్‌టెన్సీవ్ కేర్, మైక్రోబయాలజీ, జనరల్ మెడిసిన్, క్లినికల్ ఫార్మకాలజీ, థెరపిటిక్స్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల సంయుక్తాధ్వర్యంలో ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవేర్నెస్” వీక్‌లో భాగంగా ఇన్ఫెక్షన్ ప్రీవెన్షన్, కంట్రోల్ అనే అంశంపై శనివారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప ప్రారంభించారు. యాంటీబయోటిక్స్ ఇబ్బడిముబ్బడిగా వాడటం వల్ల రోగనిరోధకశక్తి తగ్గిపోతుందన్నారు. కార్యక్రమంలో నిమ్స్ డీన్ డాక్టర్ లీజా రాజశేఖర్, డాక్టర్ నావల్ చంద్ర, డాక్టర్ ఎంవీఎస్ సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.
బన్సీలాల్‌పేట్: ‘వరల్డ్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అవేర్నెస్ వీక్’ సందర్భంగా గాంధీ వైద్య కళాశాల, మైక్రోబయాలజీ విభాగంలోని వైద్య విద్యార్థులు గాంధీ దవాఖాన బయటి రోగుల విభాగం భవనం వద్ద వీధి నాటక ప్రదర్శన నిర్వహించారు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ పూజా మన్సబ్దార్ తదితరులు పాల్గొన్నారు.