సిటీబ్యూరో, మార్చి 17 (నమస్తే తెలంగాణ): నగరంలోని పలు ప్రభుత్వ బోధన దవాఖానల్లో కొందరు హెచ్ఓడీలు, ప్రొఫెసర్ స్థాయి వైద్యులు ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నారు. కొందరు ప్రొఫెసర్లు విభాగాలకే పరిమితమవగా మరికొంత మంది ప్రైవేటు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యత ఇస్తూ తీరిగ్గా మధ్యాహ్నం సమయంలో వస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొందరు సొంత పనుల్లో నిమగ్నమై తమకు ఇష్టమొచ్చిన సమయంలో వచ్చి వెళ్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరైతే ఓపీ విధులకు హాజరైనా కూడా ఒక గంట లేదా రెండు గంటలు ఉండి మమ అనిపించుకుని వెళ్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఓపి భారమంతా పీజీలు, సీనియర్ రెసిడెన్స్‌లు, అసిస్టెంట్, అసోసియేట్లపైననే పడుతున్నట్లు సదరు వైద్యులు వాపోతున్నారు. ముఖ్యంగా ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ తదితర దవాఖానల్లో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.
ప్రొఫెసర్ స్థాయి వైద్యులు ఓపిలో అందుబాటులో లేకపోవడంతో వందల సంఖ్యలో వచ్చే రోగుల భారమంతా పీజీల పైనననే పడుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని దవాఖానల్లో అయితే అసిస్టెంట్, అసోసియేట్ స్థాయి ప్రొఫెసర్లు కూడా ఓపి విధుల్లో సరిగ్గా ఉండకపోవడంతో మొత్తం భారం పీజీలు, ఎస్ఆర్లపైననే పడుతున్నట్లు కొందరు వైద్యవిద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, కోటి ఈఎన్టి, పేట్లబుర్జ్ ప్రసూతి దవాఖానల్లో కొంత మంది ప్రొఫెసర్లు క్లాసెస్ పేరుతో మధ్యాహ్నం 2గంటలకే బయటకు వెళ్లిపోతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇక ఓపికి సైతం చాలా మంది ప్రొఫెసర్లు దూరంగా ఉంటున్నారని, కొంత మంది కేవలం డిపార్ట్మెంట్ రూమ్లకే పరిమితమవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఇదే అంశంపై అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు పలు మార్లు హెచ్‌ఒడిలు, ప్రొఫెసర్లును హెచ్చరించన సందర్భాలు ఉన్నాయి. ప్రొఫెసర్లు ఖచ్చితంగా ఓపిలో ఉండాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా అప్పట్లో నాటి మంత్రి పదే పదే హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే.
అనుభవజ్ఞులైన ప్రొఫెసర్ స్థాయి వైద్యులు ఓపిలో అందుబాటులో లేకపోవడంతో, దూర ప్రాంతాల నుంచి వచ్చి, గంటల తరబడి ఓపి కోసం నిరీక్షించిన రోగులకు వైద్య విద్యార్థులే దిక్కవుతున్నారు. దీంతో కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు, ముఖ్యంగా స్పెషాలిటీ విభాగాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు సరైన వైద్యం అందడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు.