జియాగూడ, మే 27: ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో (Osmania Hospital) రోగులు, సిబ్బంది తాగునీటి ఆవసరాన్ని తీర్చేందుకు ఆర్వోప్లాంట్ను ప్రారంభిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ సహాయ్ అన్నారు. దివిస్ లాబొరేటరీస్ లిమిటెడ్ సంస్థ సహకారంతో దవాఖానలోని ఎనిమిది ప్రాంతాలలో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రారంభించిన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోగులు, వారి సహాయకులు, దవాఖాన సిబ్బందికి స్వచ్ఛమైన తాగునీటిని అందించే ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు దివిస్ లాబొరేటరీస్ లిమిటెడ్ ముందుకు రావడం అభినందనీయమన్నారు.
హాస్పిటల్లోని వివిధ ప్రదేశాలలో ఉన్న రోగులు, వారి సహాయకులు, సిబ్బందికి తాగునీటి అవసరాన్ని తీర్చేందుకు ఓటీ కాంప్లెక్స్, మార్చురీ, ఎన్పీఆర్ బ్లాక్, నర్సింగ్ స్కూల్ సమీపంలోని జనరల్ పేషెంట్స్ వెయిటింగ్ ఏరియా, టీబీ క్లినిక్ జెన్ పబ్లిక్ ఏరియా, ఓపీ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్, కులీకూత్బ్షాహీ బిల్డింగ్ వద్ద ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దవాఖాన ఆర్ఎంవోలు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.