దుండిగల్, ఫిబ్రవరి 27: ఆర్థిక ఇబ్బందులతో ఓ వైద్యుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం… గాజులరామారం సర్కిల్ (డివిజన్) పరిధి, మెట్ కాని గూడాలోని స్ప్లెండర్ అపార్ట్మెంట్స్ లో నివాసముంటున్న ఎం.విజయభాస్కర్(62) అనే వైద్యుడు నగరంలోని నిమ్స్ లో ఓ విభాగాధిపతిగా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా విజయభాస్కర్ ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు.
రెండు రోజుల కిందట ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఈనెల 25న ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా, గురువారం సూరారంలోని కట్ట మైసమ్మ (లింగం)చెరువులో ఓ గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం నీటిపై తేలి ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని నీటిలోంచి బయటికి తీసి పరీక్షించగా.. డా. విజయభాస్కర్ గా అనుమానించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యులు మృతుడిని డా .విజయభాస్కర్ గా గుర్తించడంతో శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, డా.విజయభాస్కర్ కు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నట్లు తెలుస్తుంది.