సిటీబ్యూరో, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ) : మీరు నిత్యం మెట్రోలో ప్రయాణం చేస్తుంటారా? గంటల తరబడి మెట్రో కారిడార్లలో గడిపేస్తుంటారా? అయితే ఇకపై మీరు అదనపు డబ్బులు చెల్లించాల్సిందే. ఒకసారి కొనుగోలు చేసిన టికెట్‌పై రెండు గంటల కంటే ఎక్కువ మెట్రో స్టేషన్ ప్రాంగణంలో గడిపితే… అదనపు చార్జీలను మెట్రో వసూలు చేస్తోంది. స్నేహితుల కోసమో లేదా రద్దీ ఎక్కువ ఉందని మరో ట్రైన్ కోసమో, గమ్యస్థానాన్ని చేరుకున్న తర్వాత సరదాగా మెట్రో స్టేషన్లలో ఉండే ఫుడ్ కోర్టులు, షాపింగ్ మాల్లో షాపింగ్ కోసం ఎదురుచూసి, రెండు గంటల కంటే ఎక్కువ గడిపితే ఇకపై గంటల చొప్పున ప్లాట్ఫారం చార్జీల తరహాలో వసూలు చేయనున్నది.
అదనంగా రూ. 15-50 వరకు భారం
పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించి, మెరుగైన రవాణా వ్యవస్థను ఆధునీకరించాల్సిన మెట్రో నిర్వహణ సంస్థ… అదనపు చార్జీల కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నది. పూర్తి వాటాను ప్రభుత్వానికి విక్రయించిన అనంతరం కూడా పెరిగిన అప్పుల భారాన్ని తగ్గించుకునే పనిలో పడినట్లు వ్యవహారిస్తోంది. దీంతోనే రెండు గంటల నిబంధన తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే తీసుకువచ్చిన ఈ నియమం ద్వారా మెట్రో ప్రయాణికులపై అదనంగా రూ. 15-50 వరకు భారం పడుతుందనే అంచనాలు ఉన్నాయి. కానీ ఈ విధానం ఎందుకు అమలు చేశారనేది ఇప్పుడొక చర్చనీయాంశంగా మారింది.
టికెట్ తీసుకున్న తర్వాత..
టికెట్ తీసుకుని స్టేషన్ ప్రాంగణంలోకి ప్రవేశించిన రెండు గంటల వ్యవధిలోనే ఈ ప్రయాణం పూర్తి చేయాల్సిందే. కాదు కూడదనీ మెట్రో స్టేషన్లలో ఉండే మాల్స్, మల్టీప్లెక్సులు, ఫుడ్ కోర్టులలో సంచరిస్తానంటే అదనపు చార్జీలు భరించేందుకు సిద్ధం కావాలి. అదేవిధంగా ఒక్కోసారి ఒక్కో మెట్రో స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. కొంత మంది స్టేషన్ ప్రాంగణంలో తిరుగుతున్నారనే ఈ నిబంధన విధించినట్లు ఉంది. కానీ ఒక్కోసారి మెట్రో జాప్యం, రద్దీ కారణంగా ప్రయాణికుడికి ఆలస్యం జరిగితే… రెండు గంటల కంటే ఒక్క నిమిషం గడిచినా ఇబ్బంది పడాల్సిందేనని ప్రయాణికులు వాపోతున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలపై ప్రయాణికులు సోషల్ మీడియాలో వాపోతున్నారు. కానీ మెట్రో నిర్వహణ సంస్థ మాత్రం ఈ అంశంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో చాలా మంది ప్రయాణికులు అదనపు చార్జీలను చెల్లిస్తున్నట్లు తెలిసింది.
ఎందుకీ అదనపు వసూళ్లు
ఇటీవల కాలంలో మెట్రో రద్దీ విపరీతంగా పెరిగింది. అంచనాలకు మించి మెట్రోలో ప్రయాణికుల సంఖ్య వస్తోంది. అయితే పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మెట్రో నిర్వహణ భారాన్ని జనాల నుంచి వసూలు చేసే ప్రయత్నం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సంస్థ మెట్రో చార్జీల పెంపు, పరిమిత సమయం వంటి అదనపు చార్జీలు వసూలు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ నిబంధన బారిన పడి అదనపు చార్జీలను మోసే ప్రయాణికుల సంఖ్య పెరగడమే ఇందుకు కారణం. అయితే అదనపు చార్జీల కంటే అసలు మెట్రో ప్రాంగణంలో ఎలాంటి వాణిజ్యపరమైన కార్యకలాపాలు లేకుండా చూడాలని, దీంతో ఎవరూ కూడా మెట్రోలో గంటల తరబడి ఉండరని నిత్యం ఎల్బీనగర్ నుంచి కూకట్పల్లి జర్నీ చేసే ఓ ప్రయాణికుడు వివరించారు. ఈ నిబంధన పాతదే అయినా… అదనపు చార్జీలు వెలుగులోకి రావడంతో ప్రయాణికులు కూడా రెండు గంటల పరిమితి కోసం గబారా పడాల్సి వస్తుందని వాపోతున్నారు.