
ఖైరతాబాద్, జనవరి 12 : కొవిడ్ వ్యాక్సిన్‌పై తప్పుడు ప్రచారం మానుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం.సంపత్ రావు కోరారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉపాధ్యక్షుడు డాక్టర్ వి.అశోక్, కార్యదర్శి డాక్టర్ నరేందర్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. వ్యాక్సిన్ తయారీలో భారతదేశం ప్రపంచానికే దిక్సూచిగా మారిందన్నారు. ఒమిక్రాన్, మూడవ వేవ్ మొదలైనప్పటికీ మెజార్టీ ప్రజలు వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల దాదాపుగా హాస్పిటలైజేషన్, ప్రాణనష్టం లేకుండా నివారించుకునే దశకు చేరుకున్నామన్నారు. కొంత మంది వైద్య రంగంలో కనీస అర్హత లేని వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వైద్య రంగాన్ని అపహాస్యం చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఐఎంఏ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.అశోక్ రెడ్డి, సభ్యులు డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి తదితరులు పాల్గొన్నారు.