దుండిగల్, సెప్టెంబర్ 6: తక్కువ సమయంలో అత్యధిక వర్షం పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ అడ్మిస్ట్రేటివ్ హైదరాబాద్ ప్రాంతీయ డైరెక్టర్ (ఆర్డీఎంఏ) శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం భారీగా కురిసిన వర్షంతో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రగతినగర్‌లోని ఎన్ఆర్ఐ కాలనీకి చెందిన మిథున్‌రెడ్డి (4) వరదనీటి నాలాలో పడి మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం మున్సిపాలిటీ పరిధిలో మేడ్చల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య పర్యటించారు. ప్రమాదం జరిగిన సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలోఆర్డీఎంఏ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామకృష్ణారావు కార్పొరేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ కాలనీలో జరిగిన ఈ ఘటన బాదాకరమన్నారు. ఈ ఘటనలో ఇప్పటికే వార్డు అధికారి నర్సింగరావును సస్పెండ్ చేశామన్నారు. సంబంధిత ఇంజినీరింగ్ అధికారుల పనితీరుపైనా విచారణ జరుగుతున్నదని, అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నాలాపై వేసిన పైకప్పును తొలిగించిన వారిని గుర్తించేందుకు పోలీసులు విచారణ చేపట్టారని తెలిపారు. రోడ్లపై ఉన్న మ్యాన్‌హోల్ మూతలను ఎవరూ ఓపెన్ చేయవద్దని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ప్రజలు సైతం అధికవర్షాలు పడిన సమయంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దన్నారు. చిన్నారులు, వృద్ధుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులపై కేసు.?
బాలుడు నాలాలో పడి కొట్టుకుపోయి మృతి చెందిన ఘటనకు సంబంధించి సంక్షేమ సంఘం ప్రతినిధులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాలనీ అధ్యక్ష, కార్యదర్శుల నిర్లక్ష్యం కారణంగానే దురదృష్టకరమైన ఈ ఘటన చోటు చేసుకుందని, వారిని బాధ్యులను చేస్తూ కేసు నమోదు చేసినట్లు తెలిసింది.