హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలోని భూముల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ చేసే సిఫార్సులు అనుగుణంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తీసుకునే ఎలాంటి నిర్ణయాలను అమలు చేయవద్దని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామ భూముల వ్యవహారంలో ప్రభుత్వ చర్యలపై స్పందించారు. 2026 ఏప్రిల్ 15న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను సమన్వయకర్తగా ఉంచి ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీకి ఐలాపూర్ గ్రామంలోని సర్ఫ్-ఎ-ఖాస్ భూముల అంశాలను పరిశీలించే బాధ్యత అప్పగించింది. ఈ నేపథ్యంలో 98 ఏళ్ల ఎం.ఏ. షరీఫ్ తన భూములను ఏప్రిల్ 11, 12 తేదీల్లో హైడ్రా, రెవెన్యూ అధికారులు బలవంతంగా కూల్చివేశారని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ కమిటీ ఏర్పాటు న్యాయస్థాన ఆదేశాలను పక న పెట్టేందుకు చేసిన ప్రయత్నమని సీనియర్ న్యాయవాది ఎల్. రవిచందర్ వాదించారు. కార్యనిర్వాహక శాఖ న్యాయవ్యవస్థ అధికార పరిధిని దాటి వ్యవహరించిందని పేరొన్నారు. రాజ్యాంగం నిర్దేశించిన అధికార విభజన సూత్రాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని చెప్పారు.
కమిటీకి అప్పగించిన విధులు చట్టపరమైన అధికారాన్ని ప్రస్తావించకుండా ఉండటం, చట్ట ప్రక్రియలకు సమాంతర చర్యగా ఉందని అభిప్రాయపడ్డారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది మురళీధర్‌రెడ్డి వాదిస్తూ, కమిటీ కేవలం వాస్తవాలను సేకరించడానికి ఏర్పాటు చేసిందని చెప్పారు. సాధారణ కార్యనిర్వాహక చర్య మాత్రమేనని తెలిపారు. ఇది న్యాయపరమైన సమీక్షకు ఆసారం లేదని పేరొన్నారు. ఇరుపక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి..కమిటీ తన పనిని కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ఆ కమిటీ తీసుకునే ఎలాంటి నిర్ణయాలను అమల్లోకి తేవద్దని ప్రభుత్వానికి షరతు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కేసులో కీలక అంశాలు ఉన్నందున తుది విచారణ పూర్తయ్యే వరకు స్థితి యథాతథంగా కొనసాగించాలన్నారు. కేసు తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరం చేపడతామన్నారు.