సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగా): గ్రేటర్లో వైరల్ జ్వరాలు, ఇన్ ఫ్లుయెంజా, సీజనల్ ఫ్లూ, ఎస్ఏఆర్ఐ, ఐఎల్ఐ కేసులు పెరుగుతున్నాయి. దీంతో రోగులు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలతో పాటు ప్రైవేటు క్లీనిక్‌లకు క్యూ కడుతున్నారు. సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ దవాఖానల్లో జనరల్ మెడిసిన్ విభాగానికి సంబంధించిన ఓపీ అనూహ్యంగా 10నుంచి 30శాతానికి పెరిగినట్లు ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, ఉస్మానియా, గాంధీతో పాటు గ్రేటర్‌లోని బస్తీ దవాఖానలు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. చాలా మంది రోగులు జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు వంటి లక్షణాలతో దవాఖానలకు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం రోగుల్లో కనిపిస్తున్న నేపథ్యంలోఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు జ్వరం, దగ్గు వంటి లక్షణాలను సాధారణ వైరల్ ఫీవర్‌గా భావించి చికిత్స ఆలస్యం చేయవద్దని హెచ్చరిస్తున్నారు.
తీవ్రమైన జ్వరం, వారం రోజులకుపైగా తీవ్రమైన దగ్గు కొనసాగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం, తీవ్ర నీరసం, అయోమయం, మూర్ఛ లేదా ఫిట్స్ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.హెచ్ 1ఎన్ 1, ఇన్ ఫ్లుయెంజా, ఎస్ ఏఆర్ ఐ, ఐఎల్ ఐ వంటి వ్యాధులను గుర్తించేందుకు అవసరమైతే వైద్యులు పరీక్షలు సూచిస్తారు. అయితే ప్రతి జ్వరానికీ రోగులు సొంతంగా పరీక్షలు చేయించుకోవడం లేదా మందులు వాడటం సరైన పద్ధతి కాదని వైద్యులు చెబుతున్నారు.
చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం, దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు నోరు, ముక్కుకు చేతిని అడ్డుగా పెట్టుకోవడం వంటి నియమాలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఇతరులకు దూరంగా ఉండడం, రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని తగ్గించవచ్చని వైద్యులు చెబుతున్నారు.