DJ Sounds | ఎల్బీనగర్, ఆగస్టు 21 : వినాయక నవరాత్రి ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని, అనుమతి లేకుండా డీజేలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని చైతన్యపురి సీఐ సైదులు హెచ్చరించారు. చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మోహన్‌నగర్ ప్రజయ్నివాస్లో గణేష్ ఆగమనం పేరుతో డీజే ఏర్పాటు చేసిన వారిపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా సీఐ సైదులు మాట్లాడుతూ.. గణేష్ మండప నిర్వాహకులు హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఎట్టి పరిస్థితుల్లో డీజేలను ఏర్పాటు చేయరాదని అన్నారు. డీజేలు పెట్టుకుంటే డీజేల ఓనర్స్‌పై, ఆపరేటర్స్‌పై కేసులు నమోదు చేస్తామన్నారు. సౌండ్స్ కోసం సాధారణ మైక్ స్పీకర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండపాల వద్ద సీసీ టీవీలను ఏర్పాటు చేసుకుంటే మంచిదని, మండపాల వద్ద ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు, ఫైర్ సేఫ్టీ పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని, ఎమర్జెన్సీ పరిస్థితుల కోసం హెల్ప్‌లైన్ నెంబర్లు కనిపించేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
గణేష్ ఆగమనం పేరిట డీజే ఏర్పాటు చేసిన వారిపై కేసు నమోదు
మోహన్‌నగర్ ప్రజయ్ నివాస్ వద్ద ఏర్పాటు చేయనున్న వినాయకుడి ఆగమనం పేరుతో బుధవారం రాత్రి డీజే ఏర్పాటు చేశారు. అనుమతులు లేకుండా డీజే ఏర్పాటు చేయడం పట్ల చైతన్యపురి పోలీసులు నిర్వాహకులను హెచ్చరించి డీజే సామాగ్రిని, వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. డీజే యజమానులతో పాటుగా ఆపరేటర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా డీజేలకు ఎక్కడా అనుమతులు లేవని ఎవరైన ఉల్లంగిస్తే చర్యలు తప్పవని సీఐ సైదులు తెలిపారు.