సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగర ప్రజలకు వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ బల్దియా ఉన్నతాధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సమావేశ మందిరంలో బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి, ఇన్చార్జి కమిషనర్ ఆమ్రపాలితో కలిసి మాన్ సూన్ ప్రిపరేషన్ యాక్షన్ ప్లాన్, శానిటేషన్, వెటర్నరీ, ఫుడ్ సేఫ్టీ, నాలా, యూబీడీ, బక్రీద్ ఏర్పాట్లు, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా బల్దియా ఇన్చార్జి కమిషనర్ ఆమ్రపాలి జీహెచ్ఎంసీ పరిధిలో మాన్సూన్ ప్రిపరేషన్ యాక్షన్ ప్లాన్‌ను మంత్రికి వివరించారు. అనంతరం ఆయా విభాగాల అధికారులు మాన్ సూన్ సంసిద్ధత ప్రణాళికపై చేపట్టిన చర్యల గురించి మంత్రికి వివరించారు. 141 మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించామని, సమస్య పరిషారానికి పనులు చేపట్టామని తెలిపారు. నాలాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని, మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, మొబైల్ ఎమర్జెన్సీ టీమ్స్‌ను ఏర్పాటు చేసి 24 గంటలు అప్రమత్తతతో పనిచేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. నాలా ప్రమాదాలు జరగకుండా నాలా అడిట్ చర్యలు తీసుకున్నామని, ఒకొక ఏరియాకు ఇన్చార్జి ఆఫీసర్లుగా 203 మంది అధికారులకు నోడల్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు.
సమన్వయంతో పనిచేయండి
పురాతన భవనాలు, కాంపౌండ్ వాల్స్ గుర్తించి కూల్చివేయడం, ఖాళీ చేయించడం, రిపేర్ చేయడంతో పాటు సీజ్ చేస్తున్నామని, సెల్లార్స్ కూడా గుర్తించి లేబర్ క్యాంప్స్ ఉంటే ఖాళీ చేయిస్తున్నామని, సెల్లార్ తవ్వడం ఈ సీజన్లో బ్యాన్ చేశామని మంత్రికి సంబంధిత అధికారులు వివరించారు. మ్యాన్ హోళ్ల వద్ద అన్ని విధాలా సేఫ్టీ చర్యలు తీసుకుంటున్నామని, రౌండ్ ది క్లాక్ సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు. ఎలాంటి విద్యుత్ అంతరాయం కలుగకుండా, వర్షాకాలంలో ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా ఎదురొనేలా అవసరమైన అన్ని ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉన్నామని విద్యుత్ అధికారులు వివరించారు. ప్రకృతి విపత్తులు, వర్షాలు వరదల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఆయా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం జీహెచ్ఎంసీకి అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
వన మహోత్సవానికి సిద్ధంగా ఉండండి
నాలాల్లో డి-సిల్టింగ్ ఎప్పటి కప్పుడు పూర్తి చేయాలని, ప్రజలు కూడా నాలాలో వ్యర్థాలు వేయవద్దని, ప్రవాహం సాఫీగా వెళ్లేలా చూడాలని మంత్రి పొన్నం సూచించారు.. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కుకలతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్య నిర్వహణ సజావుగా జరగాలని, క్షేత్ర పరిధిలో పర్యవేక్షించాలన్నారు. రెస్టారెంట్లు, హోటళ్లలో నాణ్యమైన, హైజినిక్ ఫుడ్ అందించేలా చూడాలని చెప్పారు. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ప్రతి జోన్‌కు ఒక వాహనం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. ఈ సంవత్సరం వన మహోత్సవానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని, ఈ కార్యక్రమం సందర్భంగా ప్రజలకు అవసరమైన, జామ, కారివేపాకుతో పాటు అడిగిన మొకలను ఇవ్వాలన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్‌కు సంబంధించినవి డిస్ప్లే చేయాలని, లే క్స్ ప్రొటెక్షన్‌పై దృష్టి సారించాలని, లేక్స్ డెవలప్మెంట్స్ సీఎస్ఆర్ కింద చేపట్టాలని, కాలుష్య రహిత వాతావరణం ప్రజలకు అందించేలా చూడాలని మంత్రి చెప్పారు.
బక్రీద్‌కు ముమ్మర ఏర్పాట్లు చేయాలి
ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ ఫార్మర్లకు ఫెన్సింగ్ వేయాలని మంత్రి సూచించారు. చికెన్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా బల్దియా ఆదాయం పెంపొందించుకోవడానికి ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పురాతన భవనాలు, నివాసయోగ్యం లేని భవనాలు గుర్తించి కూల్చివేయాలన్నారు. డివిజన్ స్థాయిలో స్లమ్ ఏరియాల్లో తిరిగి అకడికకడే సమస్య పరిషరించేలా ప్రణాళిక చేయాలన్నారు. బక్రీద్‌ను పురసరించుకొని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఈఎన్సీ జియా ఉద్దీన్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, ఎస్ఎన్డీపీ సీఈ కోటేశ్వర రావు, సీఈ దేవానంద్, జోనల్ కమిషనర్లు, స్నేహ శబరిష్, అభిలాష అభినవ్, హేమంత్ సహదేవ్ రావు, రవి కిరణ్, వెంకన్న, అడిషనల్ కమిషనర్లు కే శ్రీవాత్సవ, సత్యనారాయణ, ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మా జీవితాల్లో వెలుగులు నింపండి
స్వయం ఉపాధి పథకంలో రుణాల ద్వారా కార్లు కొనుగోలు చేసి డ్రైవర్ కం ఓనర్ డ్రైవర్లమైన తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతూ పలువురు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను బల్దియాలో కలిసి వినతిపత్రం సమర్పించారు. డ్రైవర్ కం ఓనర్స్ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కొందరు అధికారులు, బినామీ పేర్లతో ట్రావెల్స్తో తమ వాహనాలను పక్కన పెట్టి.. ఉపాధికి గండి కొడుతున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డ్రైవర్స్ కం ఓనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ దేవేందర్ కోరారు. ప్రస్తుతం ధరలకు అనుగుణంగా ప్యాకేజీని పెంచి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆటో డ్రైవర్లను ఆదుకోండి..
ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని, రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ స్టేట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహా సంఘ్ అధ్యక్షుడు లిఖిత్ కుమార్, ఉపాధ్యక్షుడు హబీబ్, ప్రధాన కార్యదర్శి సమ్మయ్యయాదవ్ బుధవారం మినిస్టర్ క్వార్టర్స్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. స్కూల్స్ ప్రారంభం కావడంతో పిల్లల ఫీజులు చెల్లించలేక ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
డీఎస్సీ నిర్వహిస్తాం: మంత్రి పొన్నం
పేదలకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. విద్యార్థుల డ్రాప్ఔట్స్ లేకుండా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. నాంపల్లిలోని అలియా ప్రభుత్వ పాఠశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 26,872 ప్రభుత్వ పాఠశాలల్లో 11 వందల కోట్లతో వసతులు కల్పించామని చెప్పారు. మెగా డీఎస్సీతో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. అనంతరం పదో తరగతి పరీక్షలో అత్యుత్తమ గ్రేడ్ సాధించిన విద్యార్థులను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్, అదనపు కలెక్టర్ హేమంత్ పాటిల్ కేశవ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత తదితరులు పాల్గొన్నారు. కాగా, హైదరాబాద్‌లో కొన్ని పాఠశాలల్లో ఉదయం అల్పహారం అందించలేదని విద్యార్థులు తెలిపారు. యూనిఫాంలు కూడా అందరికీ పంపిణీ చేయలేదని చెప్పారు.