సిటీబ్యూరో, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సందర్భంగా నగరంలో నిర్వహించిన తనిఖీల్లో రూ.6,72,430 నగదును సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్లయింగ్ స్కాడ్ ద్వారా ఇప్పటి వరకు 1,51,01,800 నగదును సీజ్ చేశామన్నారు. పోలీస్ అథారిటీ ద్వారా రూ.67,60,431 సీజ్ చేయగా.. ఇప్పటి వరకు రూ. 38,97,87,286 నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. 315 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ కింద లైసెన్స్ ఆయుధాలను ఇప్పటి వరకు 4,416 రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 5,090 చోట్ల వాల్ రైటింగ్, 70,145 పోస్టర్లు, 22,764 బ్యానర్లను తొలగించారని పేర్కొన్నారు. 75,604 నాయకుల విగ్రహాలకు మాస్కులు అమర్చడంతో పాటు ప్రైవేట్ ప్రాపర్టీల్లో 19,105 పోస్టర్లను తొలగించినట్టు వివరించారు. ఇప్పటి వరకు 20,384 విగ్రహాలకు మాస్కులు వేయడంతోపాటు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న సమావేశాలపై 14 కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదును తరలిస్తే సీజ్ చేస్తామని ఈస్ట్ జోన్ డీసీపీ సునీల్‌దత్ హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని కాచిగూడ ఏసీపీ కస్తూరి శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ రామలక్ష్మణ రాజు నేత్వత్వంలో ఎస్సై హెచ్.నరేశ్ ఆధ్వర్యంలో మంగళవారం నింబోలి అడ్డా ప్రాంతంలో కాచిగూడ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఆదిబట్లకు చెందిన పల్లె రజినీకాంత్‌గౌడ్, సీహెచ్. యాదగిరేందర్, విజయ్‌కుమార్, అశోక్ కారులో రూ.50 లక్షలు తీసుకెళ్తూ పోలీసులకు పట్టుబడ్డారు.ఆ డబ్బుకు సంబంధించిన ఆధారాలు చూపాలని ఎస్సై నరేశ్ కోరగా.. ఆ నగదును భూమి కొనుగోలు కోసం తీసుకెళ్తున్నామంటూ పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో పోలీసులు రూ.50 లక్షల స్వాధీనం చేసుకొని, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డీసీపీ ఆదేశాల మేరకు ఆదాయ పన్ను శాఖకు నగదును అప్పగించినట్లు కాచిగూడ ఇన్స్పెక్టర్ తెలిపారు.