సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ): శాసనసభకు జరిగే ఎన్నికలకు హైదరాబాద్ జిల్లాలో సోమవారం 25 మంది అభ్యర్థులు 27 నామినేషన్లు దాఖలు చేయగా.. మొత్తం 47 నామినేషన్లు, 42 మంది దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రోస్ తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో రెండు నామినేషన్లు దాఖలు చేయగా..అందులో ఇండిపెండెంట్ అభ్యర్థి రెడ్డి మల్ల పార్వతి, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి ముత్యాల రాజేశ్ నామినేషన్ వేశారు. మలక్‌పేట్ నియోజకవర్గంలో ఏఐఎంఐఎం పార్టీ అభ్యర్థి అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎల్.అశోక్ నాథ్, భార్గవి కజాయం, పోలం శ్రీనివాస్, మహ్మద్ అక్రం అలీ ఖాన్ నామినేషన్లు వేశారు. అంబర్పేట్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి పొన్నపాటి చిన్న లింగన్న నామినేషన్ దాఖలు చేశారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో రెండు నామినేషన్లు కాగా యుగ తులసి పార్టీ అభ్యర్థి డి.నాగరాజు, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్ సత్యానందన్ డేవిడ్ నామినేషన్లు వేశారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సర్రరాపు శ్రీశైలం, నాంపల్లి నియోజకవర్గంలో ఏఐఎంఐఎం పార్టీ అభ్యర్థి మహ్మద్ మాజీద్ హుస్సేన్ , కార్వాన్ నియోజకవర్గంలో ఏఐఎంఐఎం పార్టీ అభ్యర్థి కౌసర్ మోయినుద్దీన్ నామినేషన్ దాఖలు చేశారు. గోషామహల్ నియోజకవర్గంలో మూడు నామినేషన్లు దాఖలు కాగా అందులో ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి బి.శ్రీనివాస్, ఏఐఎంఐఎం పార్టీ అభ్యర్థి మహ్మద్ అబ్దుల్ అజీమ్, బీఎస్పీ పార్టీ అభ్యర్థి కళ్యాణి నందేశ్ కుమార్ నామినేషన్లు వేశారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఐఎన్సి పార్టీ అభ్యర్థి బి.నగేశ్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముప్పిడి సీతారాం రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. యాకత్‌పుర నియోజకవర్గంలో మూడు నామినేషన్లు దాఖలు కాగా ఏఐఎంఐఎం పార్టీ అభ్యర్థి జాఫర్ హుస్సేన్ రెండు సెట్లు, విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థి ఎన్.అనిల్ కుమార్ ఒక సెట్ నామినేషన్ వేశారు.
బహదూర్‌పుర నియోజకవర్గంలో మూడు నామినేషన్లు దాఖలు కాగా అందులో జై మహా భారత్ పార్టీ అభ్యర్థి షేక్ షహీన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేశ్ కుమార్ పులిపాటి, బీజేపీ పార్టీ అభ్యర్థి వై.నరేశ్ నామినేషన్లు దాఖలు చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి రాహుల్ గుప్తా కోడారపు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నెల జి.వి నామినేషన్ వేశారు. కాగా ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను అనుసరించి ఈ నెల 10వ తేదీ వరకు స్వీకరించే నామినేషన్లను మధ్యాహ్నం 3 గంటల వరకు సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో అభ్యర్థులు దాఖలు చేయాల్సి ఉంటుంది.
మేడ్చల్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో మూడో రోజు సోమవారం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో మేడ్చల్ నియోజకవర్గంలో 1, కుత్బుల్లాపూర్‌లో 1, కూకట్‌పల్లిలో 3, ఉప్పల్ నియోజకవర్గంలో 2 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా కలెక్టర్ గౌతమ్ వెల్లడించారు. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదన్నారు. నామినేషన్లు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 19 నామినేషన్లు దాఖలైనట్టు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్టు కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు.