Judge Bala bhaskar Rao | చర్లపల్లి, అక్టోబర్ 2: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తూ.. కారాగారంలోని పరిశ్రమల్లో పనిచేస్తున్న ఖైదీల వేతనాలు జైళ్ల శాఖ పెంచడం అభినందనీయమని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వి.బాలభాస్కర్ రావు అన్నారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఖైదీల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అడిషనల్ జిల్లా జడ్జి డాక్టర్ పట్టాభి రామారావు, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి కిరణ్‌కుమార్, రంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి శ్రీదేవి, జైళ్ల శాఖ హైదరాబాద్ రేంజ్ ఐజీ రాజేశ్‌తో కలిసి ఆయన గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన ఖైదీలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖైదీల సంక్షేమానికి జైళ్ల శాఖ కృషి చేయడంతో పాటు ఆదాయ వనరులపై దృష్టి సారించడం అభినందనీయమన్నారు. కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు జైలు జీవితం అనంతరం స్థిరపడేందుకు ఆయా రంగాల్లో ఉపాధి శిక్షణ ఇచ్చి.. ఉపాధి అవకాశం కల్పించడం హర్షణీయమన్నారు. అనంతరం ఖైదీలకు మిఠాయిలు పంచిపెట్టారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో చర్లపల్లి కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రామచంద్రం, అమన్ ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ అనిల్, ఇంజినీర్ మురళి, భాగ్యనగర్ డ్యాన్స్ అకాడమి ప్రతినిధి రవి, డ్యాన్స్ మాస్టర్లు సతీష్, రవిచంద్రా, సీనియర్ సినీ కామెడియన్ డాక్టర్ గౌతం రాజ్, సినీ ఆర్టిస్టులు ధన్‌రాజ్, శివప్రసాద్, ప్రమోదేవి, ఖైదీల వ్యవసాయక్షేత్రం సూపరింటెండెంట్ సమ్మయ్య, డిప్యూటీ సూపరింటెండెంట్లు కాళిదాస్, రత్నం, శశికాంత్, శ్రీనునాయక్‌తో పాటు జైలర్లు, డిప్యూటీ జైలర్లు, జైలు సిబ్బంది, ఖైదీలు తదితరులు పాల్గొన్నారు.