మేడ్చల్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపట్టే అభివృద్ధి పనులలో నాణ్యత లోపించకుండా ఉండేలా అధికారులు పర్యవేక్షించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లోని సమావేశాపుహాల్లో గురువారం అమ్మ అదర్శ పాఠశాల పనులు, స్కూల్ యూనిఫాం తయారి తదితర ఆంశాలపై అధికారులతో కలెక్టర్ గౌతమ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలో అమ్మ అదర్శ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా 286 స్కూల్స్లో చేపట్టిన తాగునీరు, టాయిలెట్స్ తదిరత పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పనులు చేపట్టక ముందు.. పనులు చేపట్టిన తర్వాత ఫొటోలు పంపాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు యూనిఫాంలను పాఠశాలల ప్రారంభానికి ముందే అందించాలని కలెక్టర్ గౌతమ్ అధికారులకు సూచించారు. స్కూల్ యూనిఫాం కుట్టు బాధ్యత స్వయం సహాయ సంఘాలకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అభిషేక్ అగ్యస్త, డీఆర్డీడీవో సాంబశివరావు, డీఈవో విజయకుమారి, తదితరులు పాల్గొన్నారు.