సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : వృద్ధుల సంక్షేమానికి అనేక చట్టాలు ఉన్నాయని, వాటిపై వృద్ధులకు అవగాహన కల్పించి, తగిన న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో సీనియర్ సిటిజన్స్ కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాధ్యత పిల్లలపై ఉందన్నారు. ఏదైనా సమస్యలు వస్తే టోల్ ఫ్రీ నంబర్ 14567ను సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మొబైల్ మెడికల్ యూనిట్‌ను ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని తెలిపారు. అయితే పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నా రు. జిల్లాలో రిజిస్టర్ కాని వృద్ధాశ్రమాలను తక్షణమే రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. పిల్లలు వారి తల్లిదండ్రులు చూడకపోతే మెయింటెనెన్స్, ట్రిబ్యునల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వారికి జిల్లా రెవెన్యూ అధికారి రూ.10 వేల మెయింటెనెన్స్ ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ సిటిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేందర్, సీనియర్ సిటిజన్ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.