విద్యుత్ సరఫరాలో ఓవర్ లోడ్ పెరిగిందా..? ఆ భారం మీదే అంటోంది… దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే వినియోగంలో ఉన్న పబ్లిక్ ట్రాన్స్ఫార్మర్లపై కనెక్షన్ల్ల భారం పెరిగి ఓవర్‌లోడ్ అయితే, దానిని అధిగమించేందుకు ఆ ప్రాంతంలోని వినియోగదారులే ఆ భారాన్ని భరించాలంటూ.. నిర్ణయాలు తీసుకుంటున్నది. క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రతి విద్యుత్ స్తంభం, ట్రాన్స్ఫార్మర్లను జీపీఎస్‌తో అనుసంధానం చేసి వాటిపై ఎంతలోడు ఉన్నదనే వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
-సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ)
గ్రేటర్ పరిధిలోని 10 సర్కిళ్ల పరిధిలో సుమారు 1.85 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఉండగా, వాటిపై చాలా చోట్ల ఓవర్ లోడ్ ఉందని గుర్తించారు. ఇలా గుర్తించిన ఓవర్ లోడ్‌ను అధిగమించేందుకు విద్యుత్ శాఖనే ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడమో, లేక అదనంగా మరిన్ని ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే విద్యుత్ శాఖపై పడే భారాన్ని వినియోగదారులపై వేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నది.
అందులో భాగంగానే రకరకాల కారణాలు చెబుతూ.. వినియోగదారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఇంటింటికీ వెళ్లి అందులో ఎన్ని విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఎంత మొత్తంలో కరెంటు వినియోగం జరుగుతున్నదో గుర్తిస్తున్నారు. ఒక భవనంలో 20 కిలోవాట్ల సామర్థ్యం దాటితే.. సొంతంగా ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. అదే సమయంలో చిన్న చిన్న కాలనీలు ఉంటే.. ఆ ప్రాంతంలోని అదనంగా సొంత ఖర్చులతో ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్ శాఖ సిబ్బంది సూచిస్తున్నారు.
గ్రేటర్ పరిధిలోని కోర్ సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో కొత్తగా ఇండ్ల నిర్మాణాలు వస్తుండడంతో విద్యుత్ కనెక్షన్లు గణనీయంగా పెరుగుతున్నాయి. అప్పటికే వినియోగంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల నుంచి వెళ్లే ఎల్ టీ లైన్ల నుంచే కొత్త కనెక్షన్లను విద్యుత్ శాఖ అధికారులు జారీ చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలోని ట్రాన్స్ఫార్మర్పై లోడ్ పెరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ శాఖే అక్కడున్న కనెక్షన్లు, వాటి లోడును పరిగణలోకి తీసుకొని కొత్త ట్రాన్స్ఫార్మర్లు, లైన్లను ఏర్పాటు చేయాల్సి ఉన్నా, ఆ విషయాన్ని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు.
అడిగిన వారికల్లా కొత్త కనెక్షన్లు ఇవ్వడం వల్ల ఒక్కసారిగా ఆ ప్రాంతంలోని లైన్లు, ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్‌లోడ్ పెరిగి తరచూ విద్యుత్ అంతరాయాలు తలెత్తున్నాయి. ఈ విషయంలో విద్యుత్ శాఖనే సొంత ఖర్చులతో ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడమో, అదనంగా మరో ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికయ్యే ఖర్చును అంతా వినియోగదారుల మీద వేసేలా చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలోనే అపార్టుమెంట్లకు మాత్రమే సొంతంగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పిన అధికారులు..ఇప్పుడు వ్యక్తిగత ఇండ్లలో ఎక్కువ విద్యుత్ కనెక్షన్లు, వినియోగం ఉంటే వాటి యజమానులు సొంతంగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారు.
విద్యుత్ శాఖ అధికారులు చెప్పినట్లు చేసుకోవాలంటే గ్రేటర్ పరిధిలోని 10 సర్కిళ్లలో 20వేలకు పైగా ట్రాన్స్ఫార్మర్లను వినియోగదారులే సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది తమకు ఎంతో భారంతో కూడుకున్నదని విద్యుత్ వినియోగదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వినియోగదారులపై భారం మోపకుండా, ఓవర్ లోడ్‌ను అధిగమించే శాఖపరంగానే విద్యుత్ నెట్‌వర్క్‌ను విస్తరించి, అదనంగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.