సిటీ బ్యూరో, బంజారాహిల్స్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌లో పంపకాల పంచాయితీ మొదలైంది. డబ్బుల పంపిణీలో కొట్లాటలు నడుస్తున్నాయి. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ అధికార కాంగ్రెస్ రూ.కోట్లను పంపకానికి తెచ్చింది. ఓటర్లను ప్రలోభపెడుతూ పంపకాలు మొదలుపెట్టింది. డబ్బు సంచులను డివిజన్ల ఇన్చార్జులు, బూత్ స్థాయి లీడర్లకు అప్పజెప్పారు. ఇదే అదునుగా డివిజన్ల ఇన్చార్జులు డబ్బు సంచులతో ఉడాయించినట్లు తెలుస్తున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్లు చేసినా సమాధానం ఇవ్వడం లేదని సమాచారం. అప్పటిదాకా ‘నా బూతే నా భవిష్యత్తు’గా భావించి వేలాది రూపాయలు వస్తాయని భావించిన కింది స్థాయి నేతల ఆశల మీద నీళ్లు చల్లినట్లయిందని చర్చించుకుంటున్నారు.
బయటి వ్యక్తుల చేతుల్లో మొత్తం డబ్బు పెట్టి తమను పక్కకు పెట్టారనే కోపంతో రగిలిపోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తున్నది. మరోవైపు వచ్చిన డబ్బుల్లో ఇన్చార్జులు, బూత్ లీడర్లు సగానికి పైగా నొక్కేశారనే గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అందుకే పంపకాల్లో భారీగా కోత పెట్టినట్లు ఇన్సైట్ టాక్ నడుస్తున్నది. కాంగ్రెస్ పెద్దలు ఒక్కో ఓటరుకు రూ.5 వేల చొప్పున ఇస్తే.. ఇన్చార్జులు, బూత్ స్థాయి నేతలు కొంత మొత్తాన్ని జేబులో వేసుకుని రూ.2 వేలే పంచుతున్నారని ఓటర్లు మండిపడుతున్నారు. తమకు రావాల్సిన డబ్బులు నాయకులెలా దాచుకుంటారని ఓటర్లు బాహాటంగానే ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తున్నది.
బూత్ ఇన్చార్జుల ఆశలపై నీళ్లు
కాంగ్రెస్ పార్టీలో సంప్రదాయంగా వస్తున్న పంచాయితీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ కొనసాగుతున్నాయి. ‘నా బూతే నా భవిష్యత్తు’ అని భావించి, ఉపఎన్నిక ప్రచారంలో కష్టపడ్డ బూత్ ఇన్చార్జులు బకరాలు అవుతున్నారు. పోలింగ్ ప్రక్రియతోపాటు ఓటర్లను బూత్‌లకు తీసుకురావడంలో అత్యంత కీలక పాత్ర పోషించే ఇన్చార్జులను డమ్మీలను చేశారని ఆవేదన చెందుతున్నారు. నెలరోజులుగా ఎన్నిక ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన తమను డబ్బుల పంపిణీలో మాత్రం పక్కన పెట్టి, బయటి నుంచి వచ్చిన నేతలకు పెత్తనం ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధిష్టానం నుంచి వచ్చిన డబ్బు సంచుల్లో కొన్నింటిని మాయం చేసి తమను, ఓటర్లను మోసం చేస్తున్నారని బహిరంగంగానే చెబుతున్నారు. తమ బస్తీల్లో పంచాల్సిన డబ్బులను నొక్కేస్తున్నారని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. రాసిచ్చిన లిస్టులో కొంతమందికే డబ్బులు ఇస్తూ ఓటర్లలో తమ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారని డివిజన్ ఇన్చార్జులు ఆరోపిస్తున్నారు. ఓటర్ల డబ్బులను కాజేసిన వారిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
నోట్ల మూటలతో నేతల జంప్?
యూసుఫ్‌గూడ కార్పొరేటర్ సీఎన్‌రెడ్డి ఇల్లు వేదికగా మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమై నోట్ల సంచులను అన్ని డివిజన్లకు పంచారు. డబ్బు సంచులను అన్ని డివిజన్ల ఇన్చార్జులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో కొంతమంది డివిజన్ ఇన్చార్జులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను అనుసరిస్తున్నారు. పలువురు నేతలు డబ్బు సంచులు చేతిలో పడగానే మూటా ముళ్లె సర్దుకొని ఉడాయించినట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ ఓటమిని ముందే పసిగట్టిన నేతలు, డబ్బులు పంచినా ప్రయోజనం లేదని భావించి అధిష్టానానికి షాకిస్తూ అందుబాటులో లేకుండా పోయినట్లు టాక్ నడుస్తున్నది.
మరికొంత మంది అధిష్టానం ఇచ్చిన దాంట్లోంచి కొంత మొత్తం పక్కకు పెట్టి, మిగతాది పంచుతున్నట్లు కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. సంబంధిత బూత్ ఇన్చార్జులు, స్థానిక నేతలు ఫోన్ చేసినా ఎత్తడం లేదని సమాచారం. ఓటర్లకు పంచాల్సిన డబ్బులను నేతలు కాజేయడంతో కాంగ్రెస్ అభ్యర్థితోపాటు, నేతలు తలలు పట్టుకున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. కొన్ని డివిజన్లలో ఇప్పటికే పంపకాలు ప్రారంభించారు. నోట్ల సంచులతో మాయమైన నేతల డివిజన్లలో బూత్ ఇన్చార్జులకు కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతున్నది. పక్క డివిజన్లలో డబ్బులు పంచుతుంటే తమకెందుకు ఇవ్వడం లేదని ఓటర్లు నిలదీస్తున్నారని వాపోతున్నారు.
మా డబ్బులు ఏమైందని ఓటర్ల నిలదీత
కాంగ్రెస్ నాయకుల నోట్ల కొట్లాటలతో తమకు నష్టం చేస్తున్నారని ఓటర్లు నిలదీస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.5 వేలు ఇవ్వాలని డివిజన్ ఇన్చార్జులు, బూత్ ఇన్చార్జులకు కాంగ్రెస్ అధిష్టానం డబ్బు సంచులను పంపిస్తే.. సగం నొక్కేసి రూ. 2 వేలే ఇస్తున్నారని మండిపడుతున్నారు. తమ డబ్బులను నాయకులు నొక్కేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఒక్కొక్కరికీ రూ.5 వేలు ఇవ్వాల్సిందేనని పట్టుపడుతున్నారు. మరికొన్ని చోట్ల నాయకులు ఒక్కొక్కరికీ రూ.5 వేలిస్తున్నామని చెప్పి జాబితా రాసుకుని రూ.2 వేలు, రూ.2,500 ఓటరు చేతిలో పెడుతున్నారు.
దీంతో ‘మా డబ్బులు మీరెందుకు దోచుకుంటున్నారని’ అక్కడికక్కడే నాయకులను నిలదీస్తున్నారు. కాంట్రాక్టులు, స్కాముల పేరిట దోచుకున్నది సరిపోవట్లేదా? అని ప్రశ్నిస్తున్నారు. పథకాలు, హామీలు అమలు చేయకపోగా.. ఓటర్లకు ఇచ్చే డబ్బులు కూడా దోచుకుంటున్నారని మండిపడుతున్నారు. పక్క డివిజన్లలో పంపకాలు కొనసాగుతున్నా.. తమకు ఇంకా ఇవ్వడంలేదని అంటున్నారు. తమ డబ్బులు కూడా కాంగ్రెస్ నేతలే జేబులో వేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.