జూబ్లీహిల్స్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని యూసుఫ్‌గూడ సవేరా ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఏర్పాటుచేసిన ఆడపడుచులకు ఆత్మీయ విందు పెండ్లి మండపాన్ని తలపించింది.
సోమవారం ‘మహిళా బంధు కేసీఆర్’ వేడుకలలో భాగంగా ఆడపడుచులకు ఆత్మీయ విందు నిర్వహించిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కార్పొరేటర్లతో కలిసి మహిళలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఏ కష్టం వచ్చినా సొంత అన్నగా అండగా నిలబడే ఎమ్మెల్యే ఆత్మీయ విందుతో మహిళలు పులకించిపోయారు.
‘మహిళా బంధు కేసీఆర్’ వేడుకలలో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తో కలిసి ఆత్మీయ విందులో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యూసుఫ్‌గూడ, బోరబండ, రహ్మత్‌నగర్, వెంగళరావునగర్, ఎర్రగడ్డ, సోమాజీగూడ డివిజన్లకు చెందిన 326 మంది లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నగర మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబాఫసియుద్దీన్, కార్పొరేటర్లు రాజ్‌కుమార్ పటేల్, దేదీప్య విజయ్, సీఎన్‌రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు కోనేరు అజయ్, సంతోష్ ముదిరాజ్, అప్పుఖాన్, ప్రదీప్, సంజీవ, మన్సూర్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.