ఖైరతాబాద్, జూన్ 20 : రాష్ట్ర వ్యాప్తంగా 11.77లక్షల మంది పిల్లలకు నట్టల మందు పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమాజిగూడలోని రాజ్‌భవన్ హైస్కూల్లో గురువారం విద్యార్థులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాతో కలిసి నట్టల మందు పంపిణీ చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 95 లక్షల అల్బెండజోల్ మాత్రలు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ నెల 27 వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, రాజ్‌భవన్ కార్యదర్శి బుర్రా వెంకటేశం, మహిళా, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టీనా చోంగ్తూ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్, కలెక్టర్ అనుదీప్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ నాయకులు మహేశ్ యాదవ్, నరేశ్ పాల్గొన్నారు.