సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): సిటీ పోలీసులలో బదిలీల చర్చ జోరుగా సాగుతోంది. ఐపీఎస్ స్థాయి నుంచి ఇన్స్పెక్టర్ల వరకు ఎవరి స్థాయిలో వారిని బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైనట్టు సిటీ పోలీసుల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీపావళికి ముందే ఈ బదిలీలు జరుగుతాయని అందరు భావించారు. అయితే, ఇప్పటి వరకు బదిలీలు జరగకపోవడంపై భిన్న వాదనాలు వినిపిస్తున్నాయి. నగర పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ రెండోసారి బాధత్యలు చేపట్టిన తరువాత భారీ స్థాయిలో బదిలీలు జరగలేదు. దీంతో ఇన్స్పెక్టర్ల బదిలీలు ఉంటాయని అందరు భావిస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలోనే మల్టీజోన్ నుంచి వచ్చిన ముగ్గురికి పోస్టింగ్‌లు ఇస్తూ ఇటీవల ఆరుగుర్ని బదిలీ చేశారు. పూర్తి స్థాయిలో బదిలీలకు ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారనే వార్త చక్కర్లు కొడుతుండటంతో చాలా మంది ప్రస్తుతం ఉన్న ఇన్స్పెక్టర్లు తమ పోస్టు ఉంటుందా.! లేదా.! అనే సందేహంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఈ బదిలీలలో తమ పేరు ఉంటుందనే భావనలో ఉన్నారు. అలాంటి వారు.. బదిలీ ఏ క్షణాన్నైనా జరుగొచ్చు.. మనకు ఏమైనా వచ్చేయి ఉన్నాయా.! అంటూ ఆ లెక్కలు సరిపెట్టుకునే పనిలో ఉన్నారు. ఇందుకు తమ వద్దకు వచ్చిన కేసుల సెటిల్మెంట్ల పనులను పూర్తి చేసుకోవడం, నెలవారీగా వచ్చే మాముళ్లలో ఏమైనా పెండింగ్‌లో ఉంటే వాటిని త్వరగా సెటిల్ చేసుకోవడంపై కొందరు దృష్టి పెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఉన్నతాధికారులు సైతం.!
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు సీసీఎస్ గుండె కాయలాంటింది. ఇప్పటి వరకు నగర అదనపు సీపీ (క్రైమ్స్) పోస్టు ఖాళీగానే ఉంది. ఈ పోస్టును భర్తీ చేయడంతో పాటు మరికొంత మంది డీసీపీల మార్పు ఉంటుందని చర్చ జరుగుతోంది. కొంత మంది డీసీపీలు సమర్థవంతంగా పనిచేయడం లేదనే విమర్శలు సైతం ఉన్నాయి. దీంతో కనీసం నలుగురైదుగురు ఐపీఎస్ స్థాయి అధికారుల మార్పులు కూడా ఉంటాయని నగర పోలీస్ విభాగంలో మాట్లాడుకుంటున్నారు. పలువురు ఏసీపీలు కూడా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ బదిలీలు రేపో మాపో ఉంటాయన్న వార్తలు కూడా వస్తున్నాయి.
పోస్టింగ్‌ల కోసం..
కొందరు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు మంచి పోస్టింగ్ కోసం తమకు తెలిసిన నాయకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. భారీగానే బదిలీలు ఉంటాయనే సమాచారం ఉండటంతో ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో నెలవారీగా ఎంత మాముళ్లు వస్తాయంటూ.. ఎవరికి వారే ఆరా తీస్తున్నట్లు సమాచారం. బదిలీలలో ఫలానా పోలీస్‌స్టేషన్ కావాలంటూ తమకు తెలిసిన నాయకుల ద్వారా ఉన్నతాధికారులకు కొందరు సిఫారసు లేఖలు కూడా పంపించినట్టు సమాచారం. మరికొందరు ఎలాగో బదిలీలలో ఇక్కడి నుంచి వెళ్లిపోతాం.. ఏమి పని చేస్తాం.. మనకు పైరవీలు చేసుకునే సత్తా లేదు.. ఎక్కడ పోస్టింగ్ వేసినా వెళ్లాల్సిందేనని వాపోతున్నారు. ఇలా నగర పోలీస్ కమిషనరేట్‌లో కొందరు బదిలీల మూడ్‌లో ఉండగా, ఇంకొందరు.. ఎప్పుడు బదిలీ చేసినా సిద్ధం అన్నట్టుగా ఉన్నారు.