సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీలో మీడియాపై ఆంక్షల కత్తి విధించేందుకు రంగం సిద్ధమైంది. ఎమర్జెన్సీ తరహా పాలనను తలపించే రీతిలో వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో మీడియాపై ఆంక్షలు విధించాలన్న దానిపై చర్చ పెట్టారు. వాస్తవంగా ఎజెండాలో ఉన్న అంశాలను మాత్రమే చర్చించాల్సిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు బాబా ఫసియుద్దీన్, సీఎన్ రెడ్డిలు యూట్యూబర్లు, చిన్న చిన్న పత్రికలకు సంబంధించిన జర్నలిస్టులతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని లేవనెత్తిన టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారుల విధి నిర్వహణకు తీవ్ర అంతరాయం, ఇబ్బందులు వస్తున్నాయని సుదీర్ఘంగా చర్చించారు.
జీహెచ్ఎంసీకి సంబంధించిన జోనల్, సర్కిల్ , ప్రధాన కార్యాలయాల్లో మీడియాకు సంబంధించిన జర్నలిస్టులను వారంలో ఒకసారి మాత్రమే అనుమతి ఇవ్వాలన్న చర్చ జరిగింది. ఎక్కువ శాతం గుర్తింపు లేని జర్నలిస్టులతోనే అసలు సమస్య వస్తుందని, దీనికి కట్టడి చేయాలని సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పారు. ఇంత వరకు బాగానే ఉన్న గుర్తింపు లేని జర్నలిస్టుల నియంత్రణ ముసుగులో పత్రికా స్వేచ్ఛను హరించేలా మొత్తం మీడియాపైనే ఆంక్షలు పెట్టేలా తీర్మానానికి కసరత్తు చేస్తున్నారు. ఈ దిశగా మేయర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో వారానికి ఒకసారి, ప్రధాన కార్యాలయంలో సీపీఆర్వో ద్వారానే మీడియాను అనుమతి ఉండేలా ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ చేసేలా కసరత్తు చేస్తున్నారు.
ఇటీవల టౌన్‌ప్లానింగ్ విభాగం, ఇంజినీరింగ్, హెల్త్ విభాగంలో విచ్చలవిడిగా అవినీతి జరిగింది. ఇందుకు 15 రోజుల వ్యవధిలోనే నలుగురు అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో అక్రమ నిర్మాణాల నుంచి స్థానిక అధికారులు, కార్పొరేటర్లపై ప్రజావాణిలో ఫిర్యాదులు లేకపోలేదు…ఇక్కడ అక్రమ కట్టడాలను, అవినీతి అధికారులను ఏరివేయకుండా ..మీడియాపై ఆ నెపాన్ని నెట్టేసే ప్రయత్నం చేస్తున్నట్లు చర్చ మొదలైంది. ముషీరాబాద్ సర్కిల్లో ఏసీపీపై కార్పొరేటర్ ప్రజావాణిలో ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అధికారుల పనితీరును ప్రశ్నించిన సమయంలో మరికొంత మంది అధికారులు భయపడిన దాఖలాలు ఉన్నాయి.
అక్రమ నిర్మాణాలపై ప్రశ్నిస్తున్నప్పుడు ఎందుకు ఇబ్బంది పడుతున్నారని, నిజంగా ఏమైనా ఇబ్బంది ఉంటే ఎంతమంది జర్నలిస్టులపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది ఇలా ఉంటే వాస్తవంగా 18 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టుకు నోచుకోలేదు. అడుగడుగునా పారిశుధ్య లోపం, గుంతల మయమైన రహదారులు, మౌలిక సదుపాయాల కల్పన విఫలం.. దీనికి తోడుగా పేట్రేగిపోతున్న కొందరు అధికారుల అవినీతి, అక్రమ నిర్మాణాల నుంచి స్థానిక కార్పొరేటర్ల మామూళ్ల దందా ..వీటన్నింటి నుంచి డైవర్షన్ చేసేందుకు మీడియాపై ఆంక్షలు పెడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.