సిటీబ్యూరో: వర్షాకాలంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాను అందించడంపై డిస్కం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో విస్తరించి ఉన్న 9 సర్కిళ్లలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా గృహ విద్యుత్‌తో పాటు వ్యాపార వాణిజ్య సంస్థలు, ఐటీ కంపెనీలు, పారిశ్రామిక వాడలన్నీ వీటి పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత వర్షా కాలంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు క్షేత్ర స్థాయిలో విద్యుత్ లైన్లను పర్యవేక్షిస్తూ నిర్వహణ, మరమ్మతు పనులు చేపడుతున్నారు. 33/11 కేవీ సబ్ స్టేషన్ నుంచి ఆయా కాలనీలు, వ్యాపార వాణిజ్య కేంద్రాలు, పరిశ్రమలకు వెళ్లే విద్యుత్ లైన్లలో ఉన్న లోపాలను గుర్తిస్తున్నారు.
సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలోని 11 కేవీ ఫణిగిరి కాలనీ ఫీడర్లో దెబ్బతిన్న జంపర్లను మార్చారు. అదేవిధంగా బంజారాహిల్స్ సర్కిల్ పరిధిలోని 11 కేవీ ఆంధ్రా బ్యాంక్ ఫీడర్లో ఏబీ స్విచ్‌ను పునరుద్ధరించి, విద్యుత్ సరఫరా సాఫీగా జరిగేలా చేశారు. సికింద్రాబాద్ సర్కిల్లోని 11 కేవీ రైల్వే రిజర్వేషన్ ఫీడర్లో హెచ్‌జీ ఫ్యూజ్‌ను మార్చివేశారు. హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ పరిధిలోని 33/11కేవీ లుంబినీ పార్కు సబ్ స్టేషన్ వద్ద దెబ్బతిన్న జంపర్లను మార్చి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా మరమ్మతులు చేపట్టారు. ప్రతి విద్యుత్ లైను తనిఖీ చేస్తూ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ఉండేలా పరికరాలను మారుస్తున్నామని సర్కిల్ అధికారులు తెలిపారు.