
ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 3: పరిశోధనల ద్వారానే ఆవిష్కరణలు సాధ్యమని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.రాంగోపాల్‌రావు అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ చాన్స్‌లర్స్ రీసర్చ్ అవార్డ్ – 2021లను సోమవారం ప్రదానం చేశారు. ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ రాంగోపాల్‌రావు హాజరై మాట్లాడుతూ.. రీసర్చ్ అవార్డును నెలకొల్పినందుకు పూర్వ విద్యార్థులను అభినందించారు. దేశంలో విద్యా సంస్థలకు, పరిశోధనలకు నిధులు పెంచాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ.. పరిశోధనలు పెంచేందుకు ఉన్నత విద్యామండలి తరఫున పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింట్ అండ్ డయగ్నోస్టిక్స్ (సీడీఎఫ్‌డీ) డైరెక్టర్ డాక్టర్ తంగరాజన్ మాట్లాడుతూ.. ఓయూ చుట్టూ అనేక పరిశోధనా సంస్థలు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలని సూచించారు. ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్‌లో పొలిటికల్ సైన్స్ విభాగానికి చెందిన అధ్యాపకురాలు డాక్టర్ శ్రీలత, సైన్స్‌లో మైక్రోబయాలజీ ప్రొఫెసర్ భీమానాయక్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన డాక్టర్ విద్యాసాగర్, యూజీసీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల విభాగంలో డాక్టర్ హరీశ్గుప్తాకు అవార్డులు అందజేశారు. ఓయూ యూజీసీ డెవలప్మెంట్ అండ్ యూజీసీ ఎఫైర్స్ డీన్ ప్రొఫెసర్ జి.మల్లేశం మాట్లాడుతూ.. ఈ అవార్డు కింద ప్రశంసా పత్రంతో పాటు రూ.పది వేల నగదు బహుమతిగా అందజేసినట్లు పేర్కొన్నారు. అవార్డులతో పాటు వివిధ సంస్థల నుంచి రీసర్చ్ ప్రాజెక్టులు, పీడీఎఫ్‌లు పూర్తి చేసిన వారికి, గ్రాంటెడ్ పేటెంట్లు పొందిన వారికి సైతం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, వివిధ ఫ్యాకల్టీల డీన్లు, కళాశాలల ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లు, వివిధ విభాగాల అధిపతులు, బీవోఎస్ చైర్మన్, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.