సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): మహానగరంలో శ్రావణమాసం సందడి జోరందుకున్నది. నగరంలోని అనేక వ్యాపార సముదాయాలు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా మహిళలు, యవతులు తమకు నచ్చిన వస్ర్తాలను ఎంపిక చేసుకొని కొనుగోలు చేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. మహిళలకు ఇష్టమైన ఈ మాసం కావడంతో అందుకు సంబంధించిన సాంప్రదాయ దుస్తులు, విభిన్న రకాల చీరలు విక్రయిస్తున్నారు.
మహిళల ఇష్టాఇష్టాలను దృష్టిలో పెట్టుకొని వస్త్ర దుఖాణాలు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి. కొన్ని షాపుల్లో మొత్తం ధరలో 40 శాతం రాయితీ ఇవ్వగా మరికొన్ని 50 శాతం ఇస్తున్నాయి. ఇలా అనేక డిస్కౌంట్లతో పోటీపడుతున్నాయి. ఈ పోటీ వాతావరణం కస్టమర్లకు కలిసొచ్చింది. శ్రావణ మాసం కావడంతో తక్కువ ధరల్లోనే తమకు నచ్చిన దుస్తులను కొనుగోలు చేసుకునే అవకాశం వారికి దక్కింది. సికింద్రాబాద్, ఫ్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట, అమీర్‌పేట, దిల్షుక్నగర్, వనస్థలిపురం, కోఠి, ఆబిడ్స్ తదితర ప్రాంతాల్లో శ్రావణ మాసం సందడి అధికంగా కనిపిస్తుంది.
ఆఫర్లతో కస్టమర్లను ఆకర్శిస్తుండటంతో అక్కడి వస్త్ర దుఖాణాలు కస్టమర్లతో రద్దీని తలపిస్తున్నాయి. ముఖ్యంగా యువత కొత్తగా వస్తున్న ఫ్యాషన్‌పై ఓ లుక్కేస్తూనే.. సెలక్షన్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలో ఫ్యాషన్ డిజైనర్లను సైతం సంప్రదిస్తూ ప్రత్యేక దుస్తులను తయారు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తమ శరీరానికి నప్పే దుస్తులను ఎంచుకోవడంలో ధరలకు వెనకాడటం లేదు.