ఎల్బీనగర్, ఏప్రిల్ 18 : ఎన్నికల ప్రచార సభల నేపథ్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఒకరినొకరు దూషించుకోవడంతో పాటు బాహాబాహీకి దిగారు. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, మల్కాజిగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునితామహేందర్‌రెడ్డి, తెలంగాణ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి సమక్షంలో పార్టీ ఏకైక కార్పొరేటర్, జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్‌లీడర్ దరిపల్లి రాజశేఖర్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి జక్కిడి ప్రభాకర్‌రెడ్డి ప్రసంగాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా బాహాబాహీకి దిగారు. గురువారం చంపాపేట, లింగోజిగూడ డివిజన్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాలనీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మల్కాజిగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునితా మహేందర్‌రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, తెలంగాణ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డిలతో పాటుగా స్థానిక లింగోజిగూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి జక్కిడి ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా పీసీసీ కార్యదర్శి జక్కిడి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర డివిజన్ల కంటే లింగోజిగూడ, చంపాపేట డివిజన్లలో తక్కువ ఓట్లు వచ్చాయని, ఈ మారు అలా కాకుండా పార్లమెంటు ఎన్నికల్లో బాగా పనిచేసి 12వేల ఓట్లకు పైగా వచ్చేలా చేయాలని అన్నారు. దీనికి సమాధానంగా లింగోజిగూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తమ డివిజన్ గురించి వేరేవారు మాట్లాడటం తగదని, వారు తమ డివిజన్ల పరిస్థినిని చూసుకోవాలంటూ పేర్కొన్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలో జక్కిడి ప్రభాకర్‌రెడ్డి డౌన్‌డౌన్ అంటూ దరిపల్లి వర్గీయులు నినాదాలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఇరువురు నాయకుల అనుచరులు రెండు గ్రూపులుగా మారి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే క్రమంలో తోపులాట జరిగింది. ఈ సందర్భంగా జక్కిడి శివచరణ్‌రెడ్డి గత ఎన్నికల్లో దరిపల్లి రాజశేఖర్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకుడు సుధీర్‌రెడ్డికి కోవర్టుగా పనిచేశాడంటూ ఆరోపణలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునితా మహేందర్‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకుల మధ్య విభేదాలు బహిర్గతం కావడంతో పార్టీ శ్రేణులు, కార్యకర్తలంతా విస్తుపోతున్నారు.