Medchal | మేడ్చల్, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లిలో సాల్వో ఇండస్ట్రీస్ అధీనంలో 315 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు స్పష్టమైన ఆధారాలతో అంకిరెడ్డిపల్లి గ్రామస్తులు అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అయినా కబ్జాకు గురైన భూమిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అంకిరెడ్డిపల్లి, ఉమ్మడి నల్గొండ జిల్లా రామలింగపల్లి గ్రామాల మధ్య జిల్లాలకు చెందిన బార్డర్ ఇష్యూ ఉందంటూ సర్వే చేయకుండానే ఇండస్ట్రీ యాజమాన్యానికి అధికారులు వత్తాసు పలుకుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ బార్డర్ ఇష్యూను తేల్చి ప్రభుత్వ భూములను గుర్తించేలా డైరెక్టర్ సర్వేల్యాండ్కు లేఖ రాసి నెల రోజులు దాటినా ఇప్పటి వరకు ఎలాంటి సర్వే చేపట్టలేదు. దీంతో కావాలనే సర్వే చేయకుండా కాలయాపన చేస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ భూముల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తున్నది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అంకిరెడ్డిపల్లికి చెందిన 887 సర్వే నంబర్లో 10 ఎకరాలు, 886 సర్వే నంబర్లో 19 ఎకరాలు, 918 సర్వే నంబర్లో 295 ఎకరాల ప్రభుత్వ భూములు 1954లో సెత్వార్తోపాటు కాస్రా పహణిలో ప్రభుత్వ భూమి అని రికార్డులో ఉందన్నది స్పష్టంగా ఉంది. అయితే మొత్తంగా 315 ఎకరాల ప్రభుత్వ భూమిని అంకిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన సాల్వో ఇండస్ట్రీస్ యాజమాన్యం కబ్జా చేసుకుని అక్రమ నిర్మాణాలు, మైనింగ్ పనులను నిబంధనలకు విరుద్ధంగా చేస్తుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 2012లో అప్పటి రెవెన్యూ అధికారులు మాన్యువల్ పహణీలలో ఉమ్మడి నల్గొండ జిల్లా రామలింగంపల్లి గ్రామానికి చెందినవిగా నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి ఈ భూములపై బార్డర్ ఇష్యూ కొనసాగుతూ వస్తున్నది.
హైడ్రా పేరిట హంగామా చేస్తున్న ప్రభుత్వానికి ప్రభుత్వ భూమి కబ్జా కనిపించడం లేదా?..అన్న ప్రశ్న ప్రజల నుంచి వస్తున్నాయి. నిరుపేదలకు ఓ న్యాయం.. పెద్దలకు మరో న్యాయం చేసేలా ప్రభుత్వ పెద్దలు వ్యహరిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూముల పర్యవేక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దల సహకారం సాల్వో ఇండస్ట్రీ యాజమాన్యానికి ఉండటం వల్లే బార్డర్ ఇష్యూను తేల్చకుండా కావాలనే సర్వే చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఈ సర్వే విషయమై అధికారులను వివరణ కోరగా.. త్వరలోనే సర్వే చేసి బార్డర్ ఇష్యూతోపాటు ప్రభుత్వ భూముల కబ్జాలను తేల్చుతామని సమాధానం చేబుతున్నారు.. కానీ ఇది సాధ్యమయ్యే పని కాదని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ప్రభుత్వ భూములపై చిత్తశుద్ధి ఉంటే వాటిని పరిరక్షించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.