దుండిగల్, నవంబర్ 26 : భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చింది మహాత్మాగాంధీ అయితే తెలంగాణకు స్వాతంత్య్రాన్ని తెచ్చింది మాత్రం కేసీఆర్ అని శాసనమండలి మాజీ చైర్మన్, దీక్షాదివస్ మేడ్చల్ జిల్లా ఇన్చార్జి స్వామిగౌడ్ అన్నారు. ఈ నెల 29న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ‘దీక్షాదివస్’ కార్యక్రమాన్ని పురస్కరించుకొని దుండిగల్ మున్సిపాలిటీ పరిధి గండిమైసమ్మలోని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం దీక్షాదివస్ జిల్లా స్థాయి సన్నాహక సమావేశం జరిగింది.
ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్‌రాజు అధ్యక్షతన జరిగిన సమావేశానికి స్వామిగౌడ్ ముఖ్యఅతిధిగా హాజరై బీఆర్ఎస్ నేతలకు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, వివేకానంద్, కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు,కౌన్సిలర్లు, మహిళా నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.