సిటీబ్యూరో, జూలై 5(నమస్తే తెలంగాణ): అమీర్‌పేటకు చెందిన 77 ఏండ్ల వృద్ధుడి నుంచి సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.53 లక్షలు కాజేశారు. గతనెల 18న ఢిల్లీ డీసీపీ రాజీవ్‌కుమార్ పేరుతో బాధితుడికి ఫోన్ వచ్చింది. వాట్సాప్‌లో వీడియోకాల్స్ ద్వారా పోలీస్ యూనిఫామ్‌లో కనిపించిన మోసగాడు అతనిపై కేసు నమోదైందని చెప్పాడు. అరెస్ట్ వారెంట్ జారీ అయిందని, అధికారిక దర్యాప్తు జరుగుతున్నదని చెప్పి.. అతని బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ చేస్తామన్నాడు.
నగదు ఫ్రీజ్ చేయమని సుప్రీంకోర్టు ఆర్డరిచ్చినట్లుగా వృద్ధుడిని నమ్మించాడు. తన ఖాతాలోని నగదు ట్రాన్స్ఫర్ చేయాలని, ఎంక్వైరీ చేసి తిరిగి జమ చేస్తామని చెప్పాడు. బాధితుడిని నమ్మించడానికి సైబర్ మోసగాడు ఆర్బీఐ రసీదు, సుప్రీంకోర్టు ఫ్రీజింగ్ ఆర్డర్, ఫండ్ సూపర్విజన్ సర్టిఫికెట్, లా ఎన్ఫోర్స్మెంట్ తనిఖీ నోటీసుతో సహా అనేక నకిలీ పత్రాలను వాట్సాప్‌లో పంపాడు.
దీంతో తనపై కేసు లేకుండా చేయాలంటూ తన ఖాతాలో ఉన్న రూ.53 లక్షలను సైబర్ మోసగాడు చెప్పిన ఖాతాకు బదిలీ చేశాడు. ఆ తర్వాత వీడియో కాల్ కట్ అయింది. మళ్లీ నేరగాళ్ల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.