కవాడిగూడ, మార్చి 26 : యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని తెలంగాణ యూనివర్సిటీస్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు జె.వెంకటేష్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యూనివర్సిటీలలో పనిచేస్తున్న టైమ్‌స్కేల్, డైలీవైజ్, ఎన్ఎంఆర్, కంటింజెంట్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ తదితర నాన్ టీచింగ్ సిబ్బంది వేతనాలు పెంచాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను టైమ్‌స్కేల్ సిబ్బందిగా మార్పుచేయాలని, ఉద్యోగ భద్రత కల్పించి పర్మినెంట్ చేయాలని, పనిభారం తగ్గించాలన్న డిమాండ్ల సాధన కోసం తెలంగాణ యూనివర్సిటీస్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా జె.వెంకటేష్ మాట్లాడుతూ.. జెఎన్టియు, డాక్టర్ బి.ఆర్.అంబేదర్కర్ ఓపెన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలలో ఈపీఎఫ్ అమలు కావడం లేదని, దీనిపై తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఐఆర్ ఐదు శాతం అన్ని యూనివర్సిటీలలో అమలు జరిగే విధంగా చెల్లించాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను టైమ్‌స్కేల్ ఉద్యోగులుగా మార్పు చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలలోని నాన్ టీచింగ్ డైలీవేజ్, ఎన్ఎంఆర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ తదితర కేడర్లకు రెగ్యులర్ ఉద్యోగుల మూల వేతనాన్ని కనీస వేతనంగా చెల్లించాలన్నారు.
అప్పటి లోగా రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల జీవో 60 ప్రకారం కనీస వేతనాలు తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. జీవో నంబర్ 16 ప్రకారం యూనివర్సిటీలలో ఖాళీల ఆధారంగా టైమ్‌స్కేల్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ మారితే సిబ్బందిని తొలగించే అన్‌ఫెయిర్ లేబర్ ప్రాక్టీసెస్ మానుకోవాలన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలని, రిటైర్ అయిన సిబ్బందికి ఐదు లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలన్నారు.
మహిళా ఉద్యోగులకు ఆరు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పది సంవత్సరాలు సర్వీస్ దాటిన వారిని టైంస్కేల్ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, హెల్త్‌కార్డులు ఇవ్వాలని, బస్‌పాస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర నాయకులు పాలడుగు భాస్కర్ ధర్నాలో పాల్గొని మద్దతు పలికారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మెట్టు రవి, ప్రధాన కార్యదర్శి వి.నారాయణ, ఉపాధ్యక్షులు ఎం.పద్మశ్రీ, కోశాధికారి మహమ్మద్ సలార్, అమీర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.