Arogya Shri | జూబ్లీహిల్స్,సెప్టెంబర్18: అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ఆరోగ్య మిత్రలు సమ్మెబాట పట్టారు. ఆపదలో ఉన్న లక్షల మంది గుండె చప్పుడుగా మారిన ఆరోగ్యశ్రీ ఉద్యోగుల వేతనాల వెతలు పట్టించుకునేవారే లేకపోవడంతో ఆందోళన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్యశ్రీతో పాటు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్), జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ (జెహెచ్ఎస్), ఆయుష్మాన్ భారత్ తదితర పథకాలను ప్రభుత్వ.. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో సమర్థవంతంగా అమలుచేయడంలో వీరు కీలకపాత్ర పోషిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, పీజీ, డిగ్రీ అర్హతతో కూడిన సుమారు 900 మందికిపైగా ఉద్యోగులు ఈ సేవలందిస్తున్నారు. 17 ఏండ్లుగా విధులు నిర్వరిస్తున్న వీరిని ఎవరూ పట్టించుకోవడం లేదు. 24 గంటలు రోగులకు అందుబాటులో ఉంటున్న ఈ ఉద్యోగులకు నేటికీ నాటి వేతనాలే దిక్కవడంతో దుర్భర స్థితిలో బతుకులు వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రితో పాటు ఇతర మంత్రులకు, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో సమ్మెకు వెళ్లక తప్పడంలేదని ఆరోగ్య మిత్ర సిబ్బంది పేర్కొంటున్నారు.
ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ డీఆర్.రమేశ్ కుమార్, రామకృష్ణ (ఆపరేషన్స్), జీఎం కార్తీక్ రెడ్డి (అకౌంట్స్) తదితర అధికారులకు రాష్ట్రంలోని 25 జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్ష, కార్యదర్శులు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆరోగ్యమిత్ర సిబ్బందికి డేటా ప్రాసెసింగ్ క్యాడర్ కల్పించాలని, జీఓ 60 ప్రకారం రూ.22,750 వేతనం తక్షణమే అమలుచేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది.
ఆరోగ్యమిత్రల జీతభత్యాలు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా కాకుండా నేరుగా ట్రస్ట్ ద్వారా చెల్లించాలని, సీనియారిటీ ప్రకారం ప్రమోషన్స్ ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాబోయే పీఆర్సీలో కనీస వేతనం రూ.35 వేలతో పాటు టీఏ, డీఏ సౌకర్యం కల్పించాలని సమ్మె నోటీసులో కోరారు. ఆరోగ్యమిత్ర ఉద్యోగులందరికీ హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలని.. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియో కల్పించాలని డిమాండ్ చేశారు.