హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 24 : రిటైర్మెంట్ ఉద్యోగుల బకాయిలు, బెనిఫిట్స్చెల్లింపుల విషయంలో క్యాబినెట్ సమావేశంలో 2024 నుంచి రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను విడుదల చేయడానికి, రాబోయే వంద రోజుల్లోగా రూ.6,200 కోట్ల బకాయిలు చెల్లించాలని రాష్ర్ట మంత్రివర్గం నిర్ణయించింది. ఇన్నాళ్లు ఆలస్యమైనా ఎలాంటి వాయిదాలు వేయకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏక మొత్తంలో చెల్లించి కేబినెట్ నిర్ణయాన్ని అమలు పరచాలని రిటైర్మెంట్ బకాయిల సాధన కమిటీ రాష్ర్ట కో కన్వీనర్ శ్రీధర్ల ధర్మేంద్ర, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హనుమకొండ జడ్పీలోని పీఆర్టీయూ భవనంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎండి.అబ్దుల్ గఫార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ మార్చి 2024 నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెన్ఫిట్స్ అందక అనేక కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయని, గత అక్టోబర్ 25 నుండి నేటి వరకు 91 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారన్నారు. చివరికి ఉద్యోగ జేఏసీ కూడా ఉద్యమించడంతో రిటైర్డ్ ఉద్యోగుల బాధలను ప్రభుత్వం గుర్తించి రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు 100 రోజుల్లో చెల్లించడానికి నిర్ణయం తీసుకొని అమలుకై ‘రెవెన్యూ రిసోర్స్ ఒబిలైజేషన్ కమిటీ’ ఏర్పర్చి దాని ద్వారా నిధులు సేకరిస్తూ, సమస్య పరిష్కారానికి వచ్చే నెల 4వ తేదిన జరగబోయే క్యాబినెట్ సమావేశంలో స్పష్టమైన నిర్ణయానికి రానుందన్నారు.
ఇప్పటికైనా వంద రోజుల్లో రిటైర్డ్ ఎంప్లాయిస్ అన్ని బకాయిలను పూర్తి చేసి ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలని వారు డిమాండ్ చేశారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతికి శ్రద్దాంజలి ఘటించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్స్ వెంటనే ప్రభుత్వం నెరవేర్చి వారి బలిదానాలు నివారించాల్ని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ఉంటుందని వారు తెలిపారు. ఈ సమావేశంలో సహా కార్యదర్శి మేకేరి దామోదర్, ఈ.ఇంద్రసేనారెడ్డి, విశ్వనాథం, బత్తిని సారయ్య, శ్యామ్, క్షీర సాగర పాల్గొన్నారు.