సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : చెరువుల సుందరీకరణలో భాగంగా విజయ్‌నగర్ కాలనీ డివిజన్ దేవునికుంట చెరువును సుందరంగా తీర్చిదిద్దారు. చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క, చుట్టూ ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, దోమల స్వైర విహారం, మురుగునీటి దుర్వాసనతో స్థానికులు ఇబ్బంది పడ్డారు.
ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ ఆదేశాల మేరకు జోనల్ కమిషనర్ రవికిరణ్, అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది వారం రోజులుగా చెరువు సుందరీకరణ పనులు చేశారు. తొలుత దోమల నియంత్రణకు చర్యలు చేపట్టారు. చెరువులో గుర్రపు డెక్క, ఆల్గేను తొలగించారు. చెరువు చుట్టూ ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి అందంగా తీర్చిదిద్దారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.