మారేడ్‌పల్లి, జనవరి 29:మోండా డివిజన్ రెజిమెంటల్‌బజార్‌లో పలు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే జి. సాయన్న కోట్ల నిధులు కేటాయించి, స్థానికంగా ఉన్న పలు దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నారు. ఇందులో భాగంగా సుమారు రూ. 29 లక్షల వ్యయంతో రెజిమెంటల్‌బజార్‌లోని మనోహర్ థియేటర్ వద్ద నలా నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి. అదేవిధంగా రూ.34 లక్షల వ్యయం తో సెబాస్టియన్ రోడ్డులో సీసీ రోడ్డు నిర్మాణం కోసం రోడ్డును తవ్వగా, రెండు రోజులు ఈ ప్రాంతంలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా స్థానికంగా ఉన్న హిల్‌స్ట్రీట్ ప్రభుత్వ పాఠశాల పక్కనే సుమారు 52 లక్షల వ్యయంతో జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందు బాటులోకి తీసుకొచ్చే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
జూలమ్మ బస్తీలో 16 లక్షలు, సలూజ నర్సింగ్ వద్ద రూ.23 లక్షల వ్యయంతో త్వరలో సీవరేజ్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
మౌలిక వసతులకు ప్రాధాన్యం
మోండా డివిజన్లో కోట్ల రూపాయల నిధులు వెచ్చించి పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. డివిజన్ పరిధిలోని మారేడ్‌పల్లి, రెజిమెంటల్‌బజార్, అంబేద్కర్‌నగర్, జేపీనగర్, లోహియానగర్ తదితర ప్రాంతాల్లో లక్షల రూపాయల నిధులతో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం, పార్కుల అభివృద్ధి, తాగునీరు, డ్రైనేజీ పైపులైన్ల నిర్మాణం, జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయ నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా బస్తీ, కాలనీల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సాయన్న , కంటోన్మెంట్ ఎమ్మెల్యే