సిటీబ్యూరో, జనవరి 22(నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధిలో భాగంగా కొనసాగుతున్న పలు రకాల నిర్మాణాలు, పురోగతి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. పనులలో పురోగతి చూపించాల్సిన అధికారులు నిర్మాణ పనులలో వేగం తగ్గించారు. వాస్తవానికి ఓయూలోని ఐఐసీటీ ఎదురుగా ఏర్పాటు చేస్తున్న రెండంతస్తుల పరిపాలన భవనం ఇప్పటికే దాదాపు 70 శాతం పనులు పూర్తి కావాల్సి ఉండేది.
కాని, ఇప్పటి వరకు దాదాపు 30 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. పైగా గ్రౌండ్ ప్లస్ 2 అంతస్తులతో నిర్మిస్తున్న అత్యాధునికమైన హంగులతో పరిపాలన భవనం నిర్మిస్తున్నారు. దీనిని కేవలం కొద్ది కాలంలోనే పూర్తి చేసి, పరిపాలన సౌలభ్యం కోసం అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా రాష్ట్ర విద్య సంక్షేమ మౌలిక వసతి కల్పన అభివృద్ధి సంస్థకు అప్పగించారు. అయితే, గతంలో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఈ భవనానికి సంబంధించిన పనులు వేగంగా కొనసాగాయి.
ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన నూతన కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ఓయూ అభివృద్ధి పనులపై పెద్దగా దృష్టి పెట్టినట్లుగా కనిపించడం లేదు. దీంతో ఓయూలో కొత్తగా నిర్మాణంలో ఉన్న భవనాల పనులు నత్త నడకన కొనసాగుతున్నాయి. కేవలం దీనిని ప్రారంభించిన 12 నెలల్లోనే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుత నిర్మాణ పరిస్థితులను చూస్తే, మరో ఏడాదైనా ఈ భవనం పూర్తయ్యే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదన్న అభిప్రాయాల్ని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు.
అయితే, విద్యార్థులు, పరిపాలన అవసరాల దృష్ట్యా పరిపాలన భవనాలతో పాటు కొత్త హాస్టళ్ల నిర్మాణాలు కూడా వేగంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఓయూ అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే, ఈ విషయంలో ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు వ్యవహరిస్తున్న విధానంపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.