ENT Hospital | సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): చారిత్రాత్మక గుర్తింపు ఉన్న కోఠి ఈఎన్టీ దవాఖానకు ప్రతి రోజు వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధుల చికిత్సకు ఆ దవాఖానకు ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ అది ఒకప్పుడు.. ప్రస్తుతం పాలకుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈఎన్టీ దవాఖాన పనితీరు రోజురోజుకు మసకబారుతోంది. ప్రస్తుతం ఇక్కడ ఏదైనా శస్తచ్రికిత్సలు చేయించాలంటే వారాల తరబడి నిరీక్షించాల్సిందే.
వేధిస్తున్న సిబ్బంది కొరత..
నిత్యం వె1000 నుంచి 1200మంది రోగులు ఓపీ సేవలు పొందే ఈ దవాఖానలో 200 నుంచి 250 మంది వరకు ఐపీ సేవలు పొందుతుంటారు. చెవి, ముక్కు, గొంతు వైద్యం కోసం తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల నుంచి కూడా రోగులు కోఠి ఈఎన్టీకి వస్తుంటారు. అయితే ఇటీవల జరిగిన బదిలీలతో ఆస్పత్రిలో సిబ్బంది కొరత తలెత్తింది. బదిలీ అయిన ఖాళీలను భర్తీ చేయకపోవడం, పదవీ విరమణతో ఖాళీ అయిన పోస్టుల్లో కొత్తవారిని నియమించకపోవడంతో రానురాను సిబ్బంది కొరత తీవ్రమై, రోగులకు శాపంగా మారుతోంది.
డాక్టర్ల పోస్టులు ఖాళీ…
కోఠి ఈఎన్టీలో మొత్తం ఐదు మంది ప్రొఫెసర్లు ఉండాలి. ఇటీవల జరిగిన బదిలీల్లో ముగ్గురు ప్రొఫెసర్లు బదిలీ కావడంతో ప్రస్తుతం ఇద్దరు ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. దీంతో మూడు ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఐదు ఉండగా ప్రస్తుతం ముగ్గురే ఉన్నారు. దీంతో 2అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 14 ఉండగా ఇప్పుడు కేవలం 6 మంది మాత్రమే ఉన్నారు.
ఫార్మసిస్టులు లేరు…
దవాఖానలో ఫార్మసిస్టుల పాత్ర కీలకం. వైద్యులు రాసిన మందులను సరిగ్గా ఇవ్వాలంటే ఫార్మసిస్టులు కావాలి. అయితే కోఠి ఈఎన్టీ దవాఖానలో నాలుగు ఫార్మసిస్టు పోస్టులు ఉండగా ప్రస్తుతం ఒక్కరు కూడా లేరు.
అరకొరగా నర్సింగ్ సిబ్బంది..
వైద్యసేవల్లో మరో కీలక పాత్ర పోషించేది నర్సింగ్ సిబ్బంది. ఈఎన్టీలో సరిపోను నర్సింగ్ సిబ్బంది కూడా లేకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. సుమారు 50శాతం మంది మాత్రమే నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండటంతో వైద్యసేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని రోగులు వాపోతున్నారు.
వైద్యపరీక్షలూ బయటనే….
మందులు, వైద్యపరీక్షల కోసం రోగులను బయటకు పంపవద్దని అధికారులను ఆదేశించడంతో పాటు అందుకు అవసరమైన మందులు, వైద్య పరికరాలను సమకూర్చి, నిరుపేద రోగులకు ఇబ్బందులు కలగకుండా నాటి కేసీఆర్ సర్కార్ విప్లవాత్మక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే కాంగ్రెస్ సర్కార్ వైద్యశాఖను ఐసీయూలోకి నెట్టేసింది. బీఆర్ఎస్ హయాంలో ఈఎన్టీలో సరిపడా సిబ్బందిని నియమించడంతో పాటు అత్యాధునిక వైద్యపరికరాలు, మందులను సమకూర్చగా ప్రస్తుత రేవంత్ సర్కార్ ఉన్న ఉద్యోగులను బదిలీల పేరుతో వేరేచోటకు తరలించడంతో పాటు నూతన సిబ్బందని కేటాయించడంలేదనే విమర్శలున్నాయి . దీనికి తోడు సీటీ స్కాన్, ఎక్స్రే వంటి వైద్యపరీక్షలన్నీ బయటనే చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొన్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు.
మూడు వారాలు ఆగమంటున్నారు..
‘ముక్కలో ధూలం అడ్డు వచ్చి ఊపిరాడ్తలేదని కోఠి ఈఎన్టీ ఆసుపత్రికి వెళ్తే పరీక్షించిన డాక్టర్లు.. కొన్ని టెస్టులు రాశారు. డాక్టర్లు రాసిన చీటీ తీసుకుని కౌంటర్ వద్ద చూపిస్తే ఈ పరీక్షలు గీడ లేవు, బయట చేపించుకోవాలని చెప్పిండ్రు. దేవుడా అని పరీక్షలన్నీ బయటనే చేపిచ్చినం. అనంతరం ఆపరేషన్ చేస్తామని చెప్పి ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. అయితే మరుసటిరోజే నర్సు వచ్చి మీకు ఆపరేషన్ ఇప్పుడే చెయ్యరని, డిశ్చార్జ్ చేస్తారని చెప్పింది. ఇదేంటని డాక్టర్ దగ్గరకు పోయి అడిగితే మీకన్నా ముందు చాలామంది ఉన్నారు. మీకు మూడు నాలుగు వారాల తర్వాత చేస్తం అని చెప్పారు. ఆ మూడు వారాలయ్యే సరికి నా ఊపిరి ఆయింత ఆగిపోయేటట్లే ఉంది’ అంటూ ఒక బాధితుడు తన గోడు వెల్లబోసుకున్నాడు. అయితే ఇలాంటి బాధితులు ఈఎన్టీలో రోజుకు ఎంతోమంది తిరిగిపోతున్నట్లు సమాచారం.