మాదాపూర్, జూన్ 19: ఇంటి నిర్మాణం, ఆధునిక ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో సరికొత్త విప్లవాత్మక మార్పులు, ఆధునిక ట్రెండ్స్‌ను ఒకే వేదికపైకి తీసుకొస్తూ మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఐఐఐడీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్) షోకేస్ ఇన్సైడర్ ఎక్స్పో 2026 మెగ్రా ప్రదర్శన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ విచ్చేసి కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, ఐఐఐడీ అధ్యక్షుడు జిగ్నేష్ మోడీతో కలిసి శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … ఐఐఐడీ హైదారాబాద్ రీజనల్ ఛాప్టర్ గత మూడు దశాబ్దాలుగా డిజైన్ రంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్, డిజైన్, ఇన్సైడర్ ఎక్స్ జాతీయ స్థాయి వేదికగా ఎదగడం అభినందనీయమన్నారు.
ఈ ప్రదర్శనలో అత్యాధునిక ఉత్పత్తులు, సాంకేతికతలు, వినూత్న డిజైన్ ఆలోచనలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన పరిష్కరాలు ఈ ప్రదర్శనలో కొలువుదీరినట్లు చెప్పారు. ఇటువంటి వేదికలు పరిశ్రమ అభివృద్ధికి, వ్యాపార అవకాశాల విస్తరణకు, నూతన భాగస్వామ్యాల ఏర్పాటుకు దోహదపడనున్నట్లు తెలిపారు. దేశంలోని పలు రాష్ర్టాల నుండి ఆర్కిటెక్టులు, ఇంటీరియర్ డిజైనర్లు, తయారీ సంస్థలు, విద్యార్థులు, పరిశ్రమ ప్రతినిధులు హాజరవడం ఇన్సైడర్ ఎక్స్ జాతీయ స్థాయి ప్రాధ్యాన్యతను చాటుతోందన్నారు. దేశంలోనే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరాలతో పోటీపడుతుందన్నారు.
తెలంగాణ పట్టణాభివృద్ధి, రవాణా, గృహ నిర్మాణం, ఆరోగ్యం, విద్య, మౌలిక వసతుల రంగాల్లో ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. ఈ అభివృద్ధి ప్రయాణంలో డిజైన్, నిర్మాణ రంగాలకు మరింత అవకాశాలు లభిస్తాయన్నారు. ఆవిష్కరణ, సుస్థిరత, భాద్యతాయుతమైన డిజైన్ భవిష్యత్ నిర్మాణ రంగానికి కీలకమని, శక్తి సామర్థ్య భవనాలు, స్మార్ట్ టెక్నాలజీలు, పర్యావరణ హిత నిర్మాణ సామాగ్రి వినియోగానికి ఎంతో అవసరంగా చెప్పారు. విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న వర్క్‌షాపులు, ప్రదర్శనలు, శిక్షణ కార్యక్రమాలు భవిష్యత్ డిజైనర్లకు, ఆర్కిటెక్టులకు, ఆవిష్కర్తలకు ప్రేరణనిస్తాయన్నారు. ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో సరికొత్త ఇంటీరియర్ డిజైన్స్, సరికొత్త డోర్స్, విండోస్, ఫింగర్ లాక్‌లు, డోర్ హ్యండిల్స్తో పాటు మరిన్ని గృహోపకరణ ఉత్పత్తులతో పాటు 300లకు పైగా బ్రాండ్లు, 150కి పైగా ఎగ్జిబిటర్లు హాజరయ్యారు.
ఐఐఐడీ షో కేస్‌లో ఆర్కిటెక్టు, ఇంటీరియర్ ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటున్న ఉడ్ ప్యాలెట్ ఎక్స్పీరియన్స్ జోన్ ఒకటి. ప్లాస్టిక్, కృత్రిమ మెటీరియల్స్ వైపు పరుగులు తీస్తున్న ఆధునిక కాలంలో తిరిగి ప్రకృతికి చేరువగా, సహజ సిద్ధమైన కలప వైపు మొగ్గు చూపేలా ఈ జోన్‌ను అత్యంత సృజనాత్మకంగా డిజైన్ చేయడం విశేషం. ఇందులో హెచ్డీఎంఆర్ పానెల్స్, వాల్ కాంక్రీట్ కలెక్షన్, వార్డ్రూబ్ కలెక్షన్, లామినెట్స్ వంటివి వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. వీటి ధర సుమారు ఎస్ఎఫ్టీకి రూ.850 నుండి మొదలుకొని రూ. 2400 వరకు ఉండనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇవి ఇండ్లలోకి, ఆఫీసులకు అత్యంత అందాన్ని ఇస్తుంది. నేటి తరం యువత, కార్పొరేట్ ఆఫీసులు, కేఫ్‌లు వంటి వాటిపై మొగ్గు చూపడంతో ఈ సహజమైన ఇంటీరియర్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.
వినూత్న త్రీడీ టెక్చర్ సర్పెస్లలో స్పర్శకకు విభిన్న అనుభూతినిచ్చే 9 రకాలు టెక్చర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో టైల్స్ పైన డిజిటల్ మిషన్లతో చెక్కినట్లుండే త్రీడీ గీతలతో తయారు చేస్తారు. పాతకాలపు చేతితో తయారు చేసిన టైల్స్‌తో పోల్చితే ఓంబ్రె కలెక్షన్ స్టోన్ టెక్చర్ వినూత్న త్రీ డీ డిజైన్లకు అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మక రెడ్ డాట్ డిజైన్ అవార్డ్, ఐఎఫ్ డిజైన్ అవార్డ్ వంటి అవార్డులను కైవసం చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గచ్చిబౌలి కేంద్రంగా పనిచేసే ఆక్టివ్ గ్రీన్ ప్రొడక్ట్స్ లగ్జరీ ఇండ్లు, విల్లాలు, కమర్షియల్ ప్రాజెక్టులకు ప్రీమియం డోర్స్, విండోస్ అందించడంలో అత్యంత ప్రసిద్ధి చెందింది.
వీరు కేవలం సాదారణ కిటీకిలు, తలుపులు మాత్రమే కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన జర్మన్ టెక్నాలజీతో వీటిని తయారు చేస్తారు. వీరి ప్లాంట్లలో విండోస్ కటింగ్, వెల్డింగ్, ఫినిషింగ్ వంటివి ప్రపంచంలోనే అత్యుత్తమమైన జర్మన్, ఇటాలియన్ ఆటోమెటెడ్ మిషనరీపై వీటిని తయారు చేస్తారని, దీనివల్ల ప్రొడక్ట్ ఫినిషింగ్ మిల్లీమీటర్ తేడా లేకుండా ఎక్కడ గ్యాప్స్ రాకుండా అత్యంత ఖచ్చితత్వంతో సిద్ధమవుతాయని నిర్వాహకుడు నరసింహరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టాల్ నిర్వాహకులు సౌరబ్ అగర్వాల్, శ్రీనాథ్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.