రూ.5.50 కోట్లతో త్వరలో సీవరేజీ పనులు
అధికారుల సమీక్షా సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్
సికింద్రాబాద్, ఫిబ్రవరి 25: సికింద్రాబాద్ పరిధిలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. తాజాగా సికింద్రాబాద్ పరిధిలో ఐదు డివిజన్లలో ప్రధానంగా సీవరేజీ సమస్యల పరిష్కారానికి రూ.5.50 కోట్ల నిధులను మంజూరు చేయించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ.. సీతాఫల్మండి డివిజన్లోని 24 పనులకు గాను రూ.283.53లక్షలు, అడ్డగుట్టలో 17 పనులకు గాను రూ. 48.94లక్షలు, తార్నాకలో 19 పనులకు సంబంధించి రూ.101.38లక్షలు, మెట్టుగూడలో 6 ప్రధాన సీవరేజీ పనులకు గాను రూ.65.19లక్షలు, బౌద్ధనగర్ డివిజన్లో చేపట్టనున్న నాలుగు పనులకు గాను రూ. 47.60లక్షల వ్యయంతో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నా యన్నారు. పనుల్లో నాణ్యత పాటించి త్వరిత గతిన పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.