సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై ఆబ్కారీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ అన్నారు. గురువారం ఆబ్కారీ భవన్లో నిర్వహించిన రంగారెడ్డి డివిజన్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎక్సైజ్ శాఖ అంటే ప్రజల్లో మంచి భావన కలిగేలా అన్ని స్థాయిల సిబ్బంది, అధికారులు వ్యవహరించాలన్నారు.
డివిజన్లోని ఐదు ఈఎస్ల పరిధిలో ఉన్న ఫంక్షన్ హాళ్లు, ఫామ్‌హౌస్‌ల్లో జరిగే విందుల్లో తెలంగాణ మద్యం వినియోగించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగించేవారిపై కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ ఉల్లంఘన జరగకుండా అధికారులు నిఘా పెట్టాలన్నారు. అంతేకాకుండా.. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలపై కూడా అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఏసీ ఆర్.కిషన్, మేడ్చల్, మల్కాజిగిరి, శంషాబాద్, సరూర్‌నగర్, వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు ఎస్.కె.ఫయాజుద్దీన్, కె.నవీన్‌కుమార్, ఎన్.కృష్ణప్రియ, ఉజ్వలారెడ్డి, విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.