సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ) : పోలింగ్ సమర్థవంతమైన నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర క్రియాశీలకమని తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సామగ్రిని అక్టోబర్ 29న ఆయా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి తీసుకొని నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లాలని డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నూతనంగా నియమించబడ్డ పీఓ, ఏపీఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి మాట్లాడారు. పీఓ, ఏపీఓలు పోలింగ్ రోజు ఉదయం 5:30 గంటలకు మాక్ పోల్‌ను ప్రారంభించి ఆయా పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో సుమారు 50 ఓట్లను ఈవీఎంలలో వేసి వాటిని సీఆర్సీ (క్లోజ్, రిజల్ట్,క్లియర్) ద్వారా క్లియర్ చేసి వారికి కేటాయించిన ప్రొఫార్మాలో నమోదు చేయాలని సూచించారు.
అనంతరం ఉదయం 7గంటలకు పోలింగ్‌ను ప్రారంభించాలని చెప్పారు. పీఓ, ఏపీఓల వద్ద ఎలక్టోరల్‌కు సంబంధించిన మదర్ రోల్, సప్లమెంటరీ రోల్, ఏఎస్‌డి , పోస్టల్ బ్యాలెట్, 80 సంవత్సరాలు పైబడిన, దివ్యాంగులకు సంబంధిత సమాచారాన్ని ముందస్తుగా పరిశీలించుకోవాలని పేర్కొన్నారు. ఈవీఎం, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లో ముందస్తుగా సాంకేతిక సమస్య వచ్చినచో సంబంధిత సెక్టోరియల్ అధికారుల ద్వారా వాటి మార్పిడికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ ప్రారంభమయ్యాక కేవలం వీవీ ప్యాట్‌లో సమస్య వచ్చినచో దానిని మాత్రమే మార్చడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
పోలింగ్ రోజు టెండర్ ఓటు, చాలెంజ్ ఓటు, టెస్ట్ ఓట్లపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ ఏజెంట్ సంబంధిత ఓటరుపై అనుమానం వ్యక్తం చేసినచో ఆయా ఓట్లను ప్రత్యేకంగా నమోదు చేయాలని తెలిపారు. ఓటర్లు తమ ఎపిక్ కార్డు లేనిచో ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపించినా ఓటు హకు కల్పించాలన్నారు. పోల్‌ను సాయంత్రం 5 గంటలకు క్లోజ్ చేసి క్యూలో నిలబడ్డ చివరి వ్యక్తికి 1వ నంబర్ కేటాయించి వారికి ఓటు హకును కల్పించాలని తెలిపారు. ప్రతి రెండు గంటలకు ఒక సారి పోలింగ్ నమోదు శాతంను అధికారులకు అందించాలని తెలిపారు. విధులు నిర్వర్తిస్తున్న పోలింగ్ సిబ్బందికి అన్ని వసతులు కల్పిస్తున్నామని విజయలక్ష్మీ తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్ మంగతాయారు, మాస్టర్ ట్రైనర్స్ మణిపాల్, సునంద, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.