సిటీబ్యూరో, ఏప్రిల్11, (నమస్తే తెలంగాణ): ఆరోగ్య తెలంగాణగా పదేళ్లు వర్ధిల్లిన రాష్ట్రం నేడు అనారోగ్యానికి గురవుతోంది. వైద్యుల కొరత వల్ల ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం సామాన్యులకు దూరమవుతోంది. బీఆర్ఎస్ పాలనలో ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా జిల్లాకో వైద్య కళాశాల నిర్మిస్తే వాటిని ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు విస్మరించారు.
రాజధాని నగరంలో మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో దంత వైద్యులు లేక మెడికల్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు, మరోవైపు దంత సమస్యలతో బాధపడేవారంతా జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో దంత వైద్యులు లేకపోవడంతో చేతినుంచి డబ్బులు ఖర్చుపెట్టి ప్రైవేట్ ఆసుపత్రుల మెట్లెక్కుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుండటం గమనార్హం. మరోవైపు ఈ సమస్యను పరిష్కరించాలని ఆల్ఇండియా డెంటల్ స్టూడెంట్ అండ్ సర్జన్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం డీఎంఈ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
గత బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలోని నూతన జిల్లాలన్నింటిలో మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టి మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రణాళికలు చేసింది. ఇందులో భాగంగానే మారుమూల జిల్లాలకు సైతం మెడికల్ కళాశాల మంజూరు చేసి, నిర్మించింది. కార్పొరేట్ స్థాయిలో సర్కార్ వైద్యం అందించాలనే లక్ష్యాన్ని కేసీఆర్ సర్కార్ నిజం చేసింది. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ వైద్యరంగాన్ని పాతరేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 38 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉండగా రాష్ట్ర రాజధానిలోని ప్రముఖ మెడికల్ కళాశాలల్లో మినహాయించి ఏ ఒక్క కళాశాలలో కూడా దంత వైద్యులు లేకపోవడం గమనార్హం. వాస్తవానికి ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం వందమంది విద్యార్థులు ఉన్న కళాశాలలో తప్పనిసరిగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రెసిడెంట్ ఒక్కొక్కరు చొప్పున డెంటల్ టెక్నీషియన్లు నలుగురు ఉండాలి. సీట్లు పెరుగుతున్న తరుణంలో సిబ్బంది కూడా పెరగాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200కు పైగా దంత విభాగంలో ఖాళీలు ఉన్నట్లు సమాచారం. వాటిని భర్తీ చేస్తేనే సర్కారు వైద్యం సామాన్యులకు అందించినవాళ్లమవుతాం. ఇప్పటికే దంత సమస్యల పరిష్కారానికి పలు ప్రైవేట్ ఆసుపత్రులు రూ.వేలల్లో వసూలు చేస్తూ, సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న దంత వైద్యుల పోస్టులు భర్తీ చేయాలి. జిల్లా ఆసుపత్రుల్లో దంత వైద్యుల కొరత వల్ల ప్రజలు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. డీఎంఈ కార్యాలయంలో ఈ సమస్యపై వినతిపత్రం అందించాం. పరిష్కారం త్వరగా చూపాలని కోరాం.
– డాక్టర్ ఎండీ మన్జుర్ అహ్మద్, డెంటల్ స్టూడెంట్ అండ్ సర్జన్స్ అసోషియేషన్ జాతీయ అధ్యక్షుడు