Balapur | బడంగ్‌పేట, జూలై 5 : ఎట్టకేలకు కబ్జ్జాదారుల చెర నుంచి ప్రభుత్వ భూమిని కాపాడారు. బాలాపూర్ పరిధిలోని కోట్ల విలువైన రెండెకరాల ప్రభుత్వ భూమిని కాజేయాలని పథకం వేశారు. అనుకున్నదే తడువుగా భూమి చుట్టు ప్రహరిని నిర్మించడానికి పనులు మొదలు పెట్టారు. గమనించిన స్థానికులు బాలాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నం.74లో ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతున్నదని తాసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ భూమిని కాజేయడానికి కబ్జాదారులు స్థానిక పెద్దల సహకారం తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు నమస్తే తెలంగాణ పత్రికను ఆశ్రయించారు.
‘ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం’ అనే పేరున కథనం ప్రచురితమైంది. దీంతో కార్పొరేటర్ మహేశ్వరి జైహింద్, పలు దళిత సంఘాల నాయకులు, స్థానికులు పేపర్ క్లిప్పింగులతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో నమస్తే తెలంగాణలో వరుస కథనాలు రావడంతో అధికారులు దిగివచ్చారు. ‘కబ్జా రాయుళ్లదే రాజ్యం’ అనే కథనానికి స్పందించిన అధికారులు గురువారం సర్వే చేయించారు.సర్వేలో ప్రభుత్వ భూమిగా తేలింది. తాసీల్దార్ మాధవి రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది శుక్రవారం జేసీబీతో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయ డంతో ఫిర్యాదుదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ భూమిని అధికారులు ప్రజా అవసరాల కోసం వినియోగించాలని స్థానికులు కోరుతున్నారు.