Delhi court | సిటీబ్యూరో, జనవరి 27 (నమస్తే తెలంగాణ): న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఓ యువకుడిని అరెస్టు చేసిన ఘటనలో ఢిల్లీ హైకోర్టు తెలంగాణ డీజీపీ వివరణ కోరింది. నోటీస్ ఇవ్వకుండా అరెస్టు చేయవద్దని సూచించింది. రాచకొండ కమిషనరేట్‌లోని మీర్పేట్ పోలీసులు నెల రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి ఓ యువకుడిని అరెస్టు చేసి తీసుకొచ్చారు. ఒక కాంగ్రెస్ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదుపై మీర్పేట్ పోలీసులు ఆగమేఘాలపై స్పందించి ఢిల్లీకి వెళ్లి ఎలాంటి న్యాయ నిబంధనలు పాటించకుండా తనను అరెస్ట్ చేశారని బాధితుడు నందీశ్వర్ రెడ్డి ఆరోపించాడు.
ఈ మేరకు తనను మీర్పేట్ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని, బాధితుడు నందీశ్వర్‌రెడ్డి డీజీపీ, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఎవరూ స్పందించకపోవడంతో ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై ఢిల్లీ కోర్టు వారం రోజుల క్రితం వాదనలు విని నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేశారని ప్రశ్నించింది. అంతర్రాష్ట్ర స్థాయిలో అరెస్ట్ చేసే సమయంలో ఢిల్లీలోనే తెలంగాణ పోలీసులు ట్రాన్సిట్ వారెంట్‌తో రిమాండ్ చేయాల్సి ఉన్నా దానిని విస్మరించారని కోర్టు పేర్కొంది. భవిష్యత్తులో పిటిషనర్‌కు నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేయవద్దని సూచించింది. పిటిషనర్‌ను అరెస్ట్ చేసే సమయంలో అవలంభించిన నిబంధనలు ఏమిటో, ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలతో 6 వారాలలో నివేదిక అందించాలని తెలంగాణ పోలీసులకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.